శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 7 మే 2021 (22:39 IST)

ఆర్టీసీకి స్వర్ణయుగం మొదలైంది: సీఎం జగన్ మాట్లాడాక డిప్యూటీ సీఎం

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అని..  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం.. కడప ఆర్టీసీ రీజనల్ కార్యాలయ ప్రాంగణంలో 22 పడకలతో నూతనంగా నిర్మించిన  "డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆస్పత్రి"ని.. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించారు.  ముఖ్యమంత్రితో పాటు ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్, ఆర్టీసీ ఈడీలు కృష్ణమోహన్, కోటేశ్వరరావుతో పాటు, పలువురు అధికారులు హాజరు అయ్యారు.
 
ఈ కార్యక్రమానికి స్థానిక "డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆస్పత్రి" ప్రాంగణం నుండి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జేసీ (రెవెన్యూ) గౌతమి, కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రాష్ట్ర పరిశ్రమల సలహాదారు రాజోలు వీరారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు మండలి చైర్మన్ అంబటి కృష్ణారెడ్డి లు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ రోజు (గురువారం) కడపలో  ఆర్టీసీ ఉద్యోగులు ఆరోగ్య భద్రతకు ఏరియా ఆస్పత్రిని  ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో ఆర్టీసీకి స్వర్ణ  యుగం మొదలైందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం... రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసి లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో.. వెలుగులు నింపడం జరిగిందన్నారు.
 
ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన అనంతరం  స్థానిక "డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆస్పత్రి" ప్రాంగణంలో.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అన్నింటినీ తీరుస్తూ.. మాట తప్పని నిజమైన నాయకుడిగా వెలుగొందుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య క్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించి.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు సంకల్పించారన్నారు.
 
జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ ఇక కడపలో ఆర్టీసికి చెందిన డాక్టర్‌ వైయస్సార్‌ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ వ్యయం రూ.3.8 కోట్లు కాగా, మరో రూ.2 కోట్లతో మెడికల్‌ ఎక్విప్‌మెంట్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. 1.6 ఎకరాలలో ఆస్పత్రి నిర్మాణం జరగ్గా, ఈ ఆస్పత్రిలో 7 గురు వైద్య నిపుణులు, 27 మంది పారా మెడికల్‌ సిబ్బందితో పాటు, హౌజ్‌ కీపింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో  వివిధ విభాగాల వైద్య నిపుణులు కూడా ఉన్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఈ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు. దాదాపు 90 వేల నుంచి లక్ష మందికి కడపలోని డాక్టర్‌ వైయస్సార్‌ ఏరియా ఆస్పత్రి సేవలు అందించనుంది. దీంతోపాటు కడప ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బస్‌స్టేషన్‌గా ప్రభుత్వం పేరు మార్పు చేఅయిందన్నారు.
 
కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. కడప ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఏరియా  ఆసుపత్రి ఏర్పాటుతో.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఎంతో ప్రయోజనం కలగనుందన్నారు. ప్రభుత్వం..  ఆర్టీసీ ఉద్యోగుల వైద్య, ఆరోగ్య అవసరాలను, ఆవశ్యకతను గుర్తించి కడప నడిబొడ్డున  డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేయడం.. సంతోషకరమైన విషయం అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హృదయ పూర్వక అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు.
 
కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, కడప మేయర్ కె.సురేష్ బాబులు మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సు డిపోలు మూతబడే పరిస్థితి ఎదురైందని.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నం జరిగిందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే..50 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగిందన్నారు.  గొప్ప మనసున్న నాయకుడు, కార్మికుల కోసం ఇంతగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి మనకు ఉండడం ఎంతో అదృష్టం అని కొనియాడారు.
 
ఈ కార్యక్రమంలో కడప నుంచి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్ రెడ్డి,  వైద్యులు, మెడికల్ సిబ్బంది, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.