సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 20 జనవరి 2020 (06:01 IST)

అమరావతి భవిత తేలేది నేడే... రాజధానిలో యుద్ధ వాతావరణం

నవ్యాంధ్ర రాజధాని అమరావతి భవిష్యత్ తేలేది నేడే. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన పాలకులు.. తాము అనుకున్నది నెరవేర్చుకునేందుకు వ్యూహాలు పన్నగా... ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షం దింపుడుకల్లం ఆశలతో ముందుకెళుతోంది.

అయితే  కోటి ఆశలతో భూములిచ్చిన రైతులు మాత్రం రాజధాని తమకే మిగల్చాలంటూ కనిపించిన దేవుడినల్లా వేడుకుంటున్నారు. పంతానికి పోయిన ప్రభుత్వం వందలాది మంది భద్రతా దళాల్ని రంగంలోకి దింపడంతో రాజధాని ఖాకీ వనంగా కనిపిస్తోంది. ఎటు చూసినా లాఠీలు, తుపాకులతో అమరావతిలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.

రాజధాని గ్రామాల్లో అడుగుకో పోలీస్‌! 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌తో ఎవ్వరూ ఇల్లు కదలకుండా కట్టుదిట్టం చేశారు. 
 
సర్కారు పెద్దలు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే... సోమవారం శాసనసభలో అమరావతికి ‘డెత్‌ వారెంట్‌’ జారీ కావడం తథ్యం! పరిపాలనను విశాఖకు తరలించేందుకు ఎప్పుడో మొదలైన ప్రయత్నాలు... ఇక సాధికారికంగా, లాంఛనంగా ముందుకు సాగుతాయి.

హైకోర్టు కర్నూలుకు తరలిపోతుంది. విశాఖ, అమరావతిలో హైకోర్టు ధర్మాసనాలు ఏర్పాటవుతాయి. అమరావతిలో శీతాకాల, వర్షాకాల సమావేశాలు మాత్రం జరుగుతాయి. బడ్జెట్‌ భేటీకి విశాఖే వేదిక అవుతుంది.
 
సోమవారం ఉదయం 9 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్‌ కమిటీ సమర్పించిన నివేదికను ఆమోదించే అవకాశముంది. సీఆర్‌డీఏ చట్టం రద్దుతోపాటు ఇప్పటిదాకా సీఆర్‌డీఏ నిర్వహించిన కొన్ని బాధ్యతలను విజయవాడ - గుంటూరు - మంగళగిరి - తెనాలి (వీజీఎంటీ) పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించడం వంటి బిల్లులను ఆమోదించే అవకాశముంది.

అలాగే, ‘మూడు రాజధానుల’ నిర్ణయంపైనా కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం... ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశమవుతుంది. ఇక్కడే అసలు ఘట్టం మొదలవుతుంది. అనుకున్నది సాధించేందుకు అధికార పక్షం... ఎలాగైనా అడ్డుకునేందుకు విపక్షం ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి. దీంతో సోమవారం సభలో జరిగే పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఏదిఏమైనా మూడు రాజధానులకు సభలో ఆమోదం పొంది తీరాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పాలన వికేంద్రీకరణపై తమ వాదనను సమర్థిస్తూ, విపక్షాన్ని దునుమాడుతూ సభలో ఒక వీడియో ప్రజంటేషన్‌ 
ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక... మంగళవారం ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశం కానుంది.

పెద్దల సభలో తమదే పైచేయి కావడంతో సర్కారు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని విపక్షం భావిస్తోంది. అదే జరిగితే ఏం చేయాలన్న అంశంపై అధికార పక్షం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలి ఆమోదించని పక్షంలో... బుధవారం మరోమారు ఈ బిల్లులను శాసనసభలో ఆమోదించి, తిరిగి మండలికి పంపించాలని భావిస్తున్నారు.

అప్పుడు... ఆ బిల్లులను మండలి తోసిపుచ్చినా ఒరిగేదేమీ ఉండదు. అంతటితో ఆగకుండా... తన నిర్ణయాలకు అడ్డుపడుతున్న శాసనమండలిని రద్దు చేయాలన్న తీవ్ర నిర్ణయాన్నీ ముఖ్యమంత్రి తీసుకోవచ్చునని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
 
జనఘోష వినిపిస్తుందా...
అభివృద్ధి వికేంద్రీకరణ కావాలా... పాలన వికేంద్రీకరణ జరగాలా? అంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. 3409 మంది అమరావతికి జై కొట్టగా... మూడు రాజధానులకు 37 ఓట్లు మాత్రమే పడ్డాయి.

ఉద్యమం ముందు ఎవరైనా తల వంచాల్సిందే : పరిటాల శ్రీరామ్
ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్‌ అన్నారు. అమరావతి ప్రాంతంలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో అసెంబ్లీలో తమకు అనుగుణంగా బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. జై అమరావతి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం వెలగపూడిలో మృతిచెందిన రైతు అప్పారావు భౌతికకాయానికి శ్రీరామ్‌ నివాళులర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
 
రాజధాని మార్పునకు ఒప్పుకోం : యనమల
అభివృద్ధి వికేంద్రీకరణకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే ఏపీ రాజధాని మార్పునకు మాత్రం ఒప్పుకోబోమని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆయన మాట్లాడుతూ…  సీఆర్‌డీఏ ఆర్థిక బిల్లుగా వస్తుండడం సరికాదని ఆయన విమర్శించారు. ఇది ఆర్థిక బిల్లు కిందకు రాదన్నారు. సీఆర్‌డీఏ అనేది ప్రత్యేక చట్టమని యనమల రామకృష్ణుడు చెప్పారు.
 
జగన్ ఇల్లు ఎవరి పేరుపై ఉంది?: ధూళిపాళ్ల 
సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతుందన్నారు. తమకు బెయిల్ కార్డులు, జైలు కార్డులు, బినామీ కార్డులు లేవని.. ఉన్న ఆస్తులన్నీ తమ పేరు మీదే ఉన్నాయన్నారు. బినామీ బతుకులు బతికేది తాము కాదని.. జగనేనని వ్యాఖ్యానించారు.

జగన్ ఉంటున్న ఇల్లు ఎవరి పేరు మీద ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకుంటున్నామన్న వాస్తవాన్ని విశాఖ వాసులు గ్రహిస్తున్నారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో 3 గంటల పాటు ఏకాంతంగా సమావేశమైన జగన్.. ఆ వివరాలను ఎందుకు చెప్పడం లేదన్నారు.

అమరావతి మంటలతో తెలంగాణ ప్రభుత్వం చలి కాచుకుంటోందని ఆరోపించారు. ఏపీలో జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణ బాగుపడుతోందన్నారు. జగన్‌ను శభాష్ అని భుజం తట్టిన కేసీఆర్... హైదరాబాద్‌లో ఉన్న పరిపాలన భవనాలను విభజించటానికి ఇష్టపడుతున్నారా? అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.

ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణగా విభజించటానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అన్నారు. 13 జిల్లాలున్న ఏపీకి 3 రాజధానులు చేస్తుంటే... 33 జిల్లాలున్న తెలంగాణకు ఎన్ని కావాలన్నారు. 2004లో వైఎస్ సీఎం కాకముందు జగన్ ఆస్తులు ఎంత, తర్వాత ఎంత అనే దానిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

కండిషన్ బెయిల్ మీద ఉన్న ఏ2 విజయసాయి.. సీబీఐ అధికారిగా ఎవరు ఉండాలో ప్రధానికి లేఖ రాస్తారా అని వ్యాఖ్యానించారు. వ్యవస్థల్ని ప్రభావితం చేసే విధంగా ఉన్న ఉత్తరాలపై సీబీఐ కోర్టుకు, ఈడీకి లేఖలు రాస్తామన్నారు.
 
నిరసన చట్టాలకు లోబడి ఉండాలి : తమ్మినేని
నిరసన చట్టాలకు లోబడి ఉండాలని, నియమాలకు విరుద్ధంగా ఎవరైనా చట్టసభల ప్రాంగణంలోకి ప్రవేశిస్తే జైలుశిక్ష విధించే అధికారం తమకు ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 
 
విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీ ముట్టడిస్తామంటూ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. శాసనసభ్యులకు తమ వాదనను వినిపించే హక్కు ఉందని, అయితే దాడులు చేస్తాం, ముట్టడిస్తామని బెదిరించడం సరైన పద్దతి కాదన్నారు. భావస్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. చట్టసభలను అందరూ గౌరవించాలన్నారు.
 
ఒకేతాటిపై నిలబడండి: జగన్‌
రాజధాని మార్పుపై ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల వాళ్లూ స్వాగతిస్తున్నట్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడేలా చూడాలని పార్టీ ముఖ్య నేతలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచించారు. ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు.

అమరావతి నుంచి సచివాలయం, హైకోర్టు తరలింపునకు అన్ని ప్రాంతాల వైసీపీ ఎమ్మెల్యేలనూ చర్చలో భాగస్వాములను చేయాలని.. తద్వారా రాష్ట్ర గొంతుకను వినిపించినట్లు అవుతుందని జగన్‌ పేర్కొన్నట్లు తెలిసింది. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపిచ్చిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఆంక్షలు అమలు చేయడం సహా.. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఆయన సమీక్షించారు.

శాసనసభలో పార్టీలో అంతర్గత సమన్వయంపైనా చర్చించారు. ఈ భేటీలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో అధికారులు హాజరయ్యారు. ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర అధికారులతో శాంతి భద్రతలపై సీఎం సమీక్ష జరిపారు.
 
టీడీఎల్పీ సమావేశానికి హాజరుకాని ఐదుగురు ఎమ్మెల్యేలు
చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. తప్పనిసరిగా సభకు హాజరుకావాలని సభ్యులకు విప్‌ జారీ చేశారు. అయితే టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరైనారు.

ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసులు, వాసుపల్లి గణేష్, అశోక్, అనగాని సత్యప్రసాద్, ఆదిరెడ్డి భవాని సమావేశానికి రాలేదు. వ్యక్తిగత కారణాలతో మీటింగ్‌కు రాలేకపోతున్నామని నేతలు చెబుతున్నారు. అయితే సోమవారం అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
 
మరోవైపు సంఖ్యాబలం తక్కువ ఉన్నా.. రాజధాని తరలింపు ప్రక్రియను అడ్డుకునే అవకాశాలపై టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. సీఆర్డీఏపై మనీ బిల్లు పెడితే ఏం చేయాలనే అంశంపైనా నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటుగా 20న అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునివ్వడంపైనా చర్చించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
 
నేతల అరెస్టులు
20వ తేదీన తలపెట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ని అడ్డుకునేందుకు పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వారికి ముందుగానే నోటీసులు ఇచ్చే కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు.

విజయవాడ గొల్లపూడిలో ఉంటున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విద్యాధరపురంలో నివాసం ఉంటున్న సీనియర్‌ నాయకుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు నోటీసు ఇచ్చారు. వారి ఇంటికి ఈ నోటీసులు అంటించారు. పోలీసుల నోటీసులపై కూడా టీడీఎల్పీలో చర్చించే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. 
 
మొక్కు ఫలిస్తుందా...
‘దయచూపు దుర్గమ్మా... పాలకుల మనసు మార్చు మాయమ్మా!’ అంటూ రాజధాని ప్రాంత మహిళలు బెజవాడ కనకదుర్గకు మొక్కులు చెల్లించుకున్నారు. తమ గ్రామాల నుంచి చెప్పుల్లేకుండా కాలి నడకన ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు.

‘అమరావతిని కాపాడుకునేందుకు ప్రాణాలైనా అర్పిస్తాం’ అని నినదిస్తూ కొందరు యువకులు రాజధాని పరిధిలో నిర్మితమైన ఉద్యోగుల క్వార్టర్లపైకి ఎక్కారు. భూములిచ్చి భంగపడ్డాం అంటూ వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.