బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (18:38 IST)

వైసీపీ ప్రభుత్వంలో పాలనే లేదు... అశోక్‌బాబు

వైసీపీ ప్రభుత్వంలో ప్రజాపాలనే లేదని, గత ప్రభుత్వపనులు, పాలకుల నిర్ణయాలను తవ్వితీయడానికే పాలకులకు సమయం సరిపోవడం లేదని, ఇక ప్రజలకు అవసరమైన పనులు ఎక్కడ జరుగుతాయని టీడీపీనేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఎద్దేవాచేశారు.

గురువారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజానుకూల పాలనే లేనప్పుడు , అవినీతి లేని పాలన, అద్భుతపాలన అందిస్తున్నామని వైసీపీనేతలు ఎలా చెప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు.

పోలవరం రివర్స్‌ టెండర్ల ద్వారా ఖజానాకు రూ.750 కోట్లు ఆదా చేశామని ప్రభుత్వం ఇప్పుడే ఎలా చెప్తుందన్న అశోక్‌బాబు, ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రెండేళ్ల  సమయం పెంచారని, దానికితోడు ప్రాజెక్ట్‌ పూర్తికాకుండానే, ఎక్కడా ఏవిధమైన పనులు చేయకుండానే అప్పుడే అంత ఆదాచేశాం....ఇంత మిగిల్చామని డబ్బాలు కొట్టుకోవడం వైసీపీ నేతలకే చెల్లిందన్నారు.

పోలవరంలో ముందు ఫైనాన్షియల్‌బిడ్‌, తరువాత టెక్నికల్‌బిడ్‌ వేయించిన  ప్రభుత్వం, ఆర్టీసీలో ఎలక్ట్రికల్‌ బస్సుల టెండర్లను మాత్రం ముందు టెక్నికల్‌బిడ్‌, తరువాత ఫైనాన్షియల్‌బిడ్‌ పద్ధతిలో ఎలా అనుమతించిందో సమాధానం చెప్పాలని అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు.

పోలవరం టెండర్లు కట్టబెట్టినట్లుగానే, ఎలక్ట్రికల్‌బస్సుల టెండర్లను తమకు అనుకూల మైన సంస్థకు కట్టబెట్టడానికి అడ్డుగా ఉన్నారనే ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుని అర్థంతరంగా బదిలీచేసిందని టీడీపీనేత తెలిపారు.  రాష్ట్రంలో టెర్రరిస్ట్‌ ప్రభుత్వం నడుస్తుందోంటూ, దేశవిదేశాలకు చెందిన రాజకీయరంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు గుర్తించాలన్నారు.

ఏబీఎన్‌, టీవీ-5ఛానళ్లను నిలిపేసిన ప్రభుత్వం గురించి మాట్లాడలేని వైసీపీ నేతలు, తెలుగుదేశంపై ఎల్లోమీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాధారణ పౌరులు ముఖ్యమంత్రిని కలవడానికి ఎంతమాత్రం అవకాశముందో, ఎన్నిరోజులు పడుతుందో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలన్న అశోక్‌బాబు, వైసీపీ నేతలు కూడా జగన్‌ను కలిసే పరిస్థితులు లేవన్నారు.

ప్రజల నుంచి, కార్మికులు, ఉద్యోగుల నుంచి  వచ్చే ఒత్తిడి తట్టుకోలేకనే జగన్మోహన్‌రెడ్డి, తన ఇంటిచుట్టూ పోలీస్‌వలయం ఏర్పరుచుకొని 144 సెక్షన్‌ పెట్టించుకున్నాడని టీడీపీనేత దెప్పిపొడిచారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమనే విషయాన్ని వైసీపీనేతలు గుర్తుంచుకోవాలన్న ఆయన, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా ప్రజాక్షేత్రంలో పట్టుదలతో పోరాటం సాగిస్తోందని చెప్పారు.

ఇప్పుడు అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఎగిరెగిరి పడుతున్న వైసీపీ, ఓటమి చవిచూస్తే, ఇంకలేవడం అసాధ్యమని  అశోక్‌బాబు తేల్చిచెప్పారు.