మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఆగస్టు 2025 (16:41 IST)

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

venkateswara swamy
కలియువగదైవంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కనీసం పది నుంచి 20 గంటల సమయం పడుతుంది. అయితే, కృత్రిమ మేథ (ఏఐ) ద్వారా కేవలం రెండు గంటల్లో దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి ఆలోచన చేస్తుంది. దీనిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమని, ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన తితిదేకి విజ్ఞప్తి చేశారు. ఏఐ పేరుతో అనవసరంగా ధనాన్ని వృథా చేయడం కంటే, ఆ నిధులను భక్తుల సౌకర్యాల మెరుగుదలకు వినియోగించడం మేలని ఆయన హితవు పలికారు.
 
ఇటీవల తాను తిరుమలకు వస్తున్నప్పుడు భక్తుల మధ్య జరిగిన సంభాషణలో ఏఐ టెక్నాలజీతో దర్శన సమయాన్ని తగ్గిస్తారన్న ప్రస్తావన వచ్చిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే, ఆలయంలో ఉండే సహజమైన పరిమితుల దృష్ట్యా ఎంతటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించినా గంటలో దర్శనం చేయించడం ఆచరణలో సాధ్యం కాదు, అది క్షేమకరం కూడా కాదన్నారు. 
 
"ఆ ఆలోచనను దయచేసి విరమించుకోవాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. దాని కోసం అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా, ప్రస్తుతం భక్తులకు కల్పిస్తున్న దర్శన సమయం అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంది. కాబట్టి, ఆ నిధులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది" అని వివరించారు. ఇదే సమయంలో, టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ధర్మప్రచార కార్యక్రమాలకు మరింత ఊపునివ్వాలని ఆయన టీటీడీ ఛైర్మన్‌ను కోరారు.