TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు
శ్రీవాణి టికెట్ హోల్డర్లకు తీర్థయాత్ర ప్రక్రియను సులభతరం చేయడానికి, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆగస్టు 1 నుండి దర్శన సమయంలో మార్పు చేసింది. శ్రీవాణి విరాళ టిక్కెట్లను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే భక్తులకు ఇప్పుడు ఉదయం వీఐపీ బ్రేక్ స్లాట్ సమయంలో కాకుండా సాయంత్రం 5 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనుమతించబడుతుంది.
బుధవారం అన్నమయ్య భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దాదాపు మూడు రోజులు దర్శనం కోసం గడుపుతున్న భక్తులపై భారాన్ని తగ్గించడమే ఈ మార్పు లక్ష్యమని తిరుమల ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోకనాధం తెలిపారు.
విరాళంగా రూ. 10,000, బ్రేక్ దర్శనానికి రూ. 500 ఖరీదు చేసే శ్రీవాణి దర్శన టిక్కెట్లను తిరుమలలో ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి దాదాపు 800 టిక్కెట్లు అమ్ముడవుతాయి. సాధారణంగా ఉదయం 11 గంటలకే అయిపోతాయి. భక్తులు తరచుగా ఒక రోజు ముందుగానే వస్తారు.
దర్శనం కోసం రాత్రిపూట వేచి ఉండాలి. అయితే ప్రస్తుతం కొత్తగా సాయంత్రం 5 గంటల స్లాట్ ద్వారా దర్శనం చేసుకోవడం ద్వారా అదే రోజు దర్శనాన్ని అనుమతించినట్లవుతుంది. దీంతో వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఆగస్టు 1 నుండి, ఆఫ్‌లైన్ టిక్కెట్ హోల్డర్లకు సాయంత్రం 5 గంటల నుండి 5:45 గంటల మధ్య వరకు దర్శనం అనుమతించబడుతుంది.
ఈ మార్పు ఆఫ్‌లైన్ టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది. టిటిడి ఆన్‌లైన్‌లో 500 టిక్కెట్లను, తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజూ 200 టిక్కెట్లను కూడా అందిస్తుంది.