శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 6 డిశెంబరు 2021 (12:44 IST)

సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలుడి అలంకారంలో ప‌ద్మావ‌తి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా సాగుతున్నాయి. ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలోశ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

 
సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్య మండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్య భగవానుని కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాస స్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు.  సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
 

అమ్మవారికి గాజులు విరాళంగా ఇవ్వ‌డం ఏళ్ళ‌త‌ర‌బ‌డి ఆన‌వాయితీగా వ‌స్తోంది. తిరుపతికి చెందిన శ్రీ పొన్నాల సుధాకర్, శ్రీ ఉదయ్ అనే భక్తులు సోమవారం ఉదయం 100 డజన్ల గాజులు, హుండీ బట్టలు విరాళంగా అందించారు. వీటిని జెఈఓ వీరబ్రహ్మంకు అందజేశారు.

    
అమ్మ‌వారి వాహన సేవలో పెద్ద జీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, జెఈఓ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు  బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శేషగిరి, మధుసూధన్, ఏవిఎస్వో వెంకట రమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్ క‌న్నా పాల్గొన్నారు.