బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 6 డిశెంబరు 2021 (10:46 IST)

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా త‌యారైన నేటి పాలకులు

రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను నేటి పాల‌కులు నీరుగారుస్తున్నార‌ని జ‌న‌సేన నేత‌లు ఆవేదన వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నేటి పాలకులు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరమని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజ్యాంగ ఫలాలను అందరికీ అందించాలన్నదే జనసేన లక్ష్యమని, ఆ దిశగా తాము ముందడుగు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . 

 
బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి  కళాక్షేత్రం వద్ద  ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్  పూలమాల వేసి నివాళులర్పించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ, మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పాలకులు అందుకు భిన్నంగా ఎస్సీ ఎస్టీ  సంక్షేమం నిధులను సైతం పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.


ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాలని, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన కోరారు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తో పాటు విజ‌య‌వాడ ఇన్ ఛార్జి పోతిన మ‌హేష్, ఇత‌ర నేత‌లు అంబేద్క‌ర్ కు నివాళులు అర్పించారు.