బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 4 డిశెంబరు 2021 (16:31 IST)

నేను అసెంబ్లీకొస్తే చూడాలని ఉందా, ఇది పైశాచిక ఆనందం కాదా?

ప్రభుత్వ అసమర్థత, తప్పిదాలతో వరదల వల్ల 62 మంది ప్రాణ నష్టం, 6 వేలకోట్ల ఆస్తి నష్టం సంభవించింద‌ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు. కొద్దిగా విజ్జతతో ప్రవర్తించి ఉంటే,  ఘోర ప్రమాదం తప్పేద‌ని, ఇగో తో వ్యవహరిస్తూ మేం చెప్పిందే వేదం అంటూ, ముఖ్యమంత్రి జగన్ పిచ్చి తుగ్లక్ గా తయారయ్యార‌ని అన్నారు. 
 
 
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంటు సాక్షిగా అన్న మాటలకు ఏం సమాధానం చెబుతార‌ని బాబు ప్ర‌శ్నించారు. ప్రపంచంలో ఇంజనీర్లు ఇదొక కేసు స్టడీగా తీసుకుంటే, మనకు అవమానం కాదా, ఎందుకు జవాబుదారితనంతో వ్యవహరించకూడదు? అని ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి బాధ్యతకు అతీతం కాదు, చేతగాకపోతే ముఖ్యమంత్రిగా అనర్హుడు. ప్రజల ఓట్లు వేసింది ప్రాణాలు తీయడానికి కాదు, కాపాడతారని ఓట్లు వేశారు, ఎప్పుడూ లేనన్ని సీట్లు ఇచ్చారు. తెలిసో, తెలియకో ఓట్లేసినందుకు ప్రాణాలు తీస్తారా? అని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 
 
కలెక్టర్ ప్రకటన ప్రకారం ఉదయం 8.30గంటలకు పించా ప్రాజెక్ట్ లో 3,845 క్యూసెక్కుల నీరు ఉంటే, సాయంత్రం 8.30కి 90వేల క్యూసెక్కులకు చేరింది, అది అర్థరాత్రికి 1.17లక్షలు వచ్చింది. ఇంత భారీగా ప్రాజెక్ట్ లో నీరు చేరుతుంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగానికి లేదా? వాటర్ ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేసే ఒక వ్యవస్థను క్రియేట్ చేశాం, అన్నింటికీ సైంటిఫిక్ గా తయారుచేసి పెట్టాం. ముందుగా హెచ్చరికలు చేసి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 
 
తాను ఇంటింటికీ తిరిగి బాధితులతో మాట్లాడినపుడు ఎవరూ హెచ్చరికలు కూడా చేయలేదన్నారు, పోయిన సారి కూడా జాగ్రత్తలు తీసుకోలేదు. పొక్లయినర్లు, టిప్పర్లకోసం నీరు విడుదల చేయకుండా ముంచేశారని చెప్పారు. ఒకే కుటుంబంలో తొమ్మిదిమంది చనిపోయారు, ఆ గ్రామంలో ఒక వ్యక్తి సీలింగ్ కొక్కీ పట్టుకొని తొమ్మిదిమందిని పట్టుకున్నాడు, అందులో ఇద్దరు శ్వాస ఆడక భుజంపై చనిపోయారు, ఏడు మందిని కాపాడారు. అతని ధైర్యం, సమయస్పూర్తితో ఏడుగురిని కాపాడారు, సర్పంచ్ ఊరందరికీ ప్రాణాలు కాపాడుకొమ్మని చెప్పి, ఇంట్లో ముగ్గురిని కోల్పోయారు. 330మీటర్ల కరకట్ట కొట్టుకుపోయింది, 19వతేదీ ఉదయం ప్రమాదం జరిగింది, 18వతేదీ ఉదయం నుంచి వరద పెరుగుతూ వస్తోంది, ప్రభుత్వం ఏం చేస్తోంది?  19వతేదీ ముఖ్యమంత్రి విన్యాసం చూశారు కదా అని ఎద్దేవా చేశారు.
 
 
నేను అసెంబ్లీ కొస్తే చూడాలని ఉంది, ఇది పైశాచిక ఆనందం కాదా? వరదలపై చర్చించకుండా ఆరోజు అసెంబ్లీలో మా మీద దాడి చేస్తారా? ప్రధాని వ్యవసాయానికి సంబంధించి ఆరోజు మూడు బిల్లులు రద్దు చేశారు, మీరు కూడా మూడు రాజధానుల బిల్లు రద్దు చేయమంటే ఎగతాళి చేస్తూ మామీద దాడిచేశారు, ఇదెక్కడి న్యాయం?  అని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు.

 
ప్రభుత్వ తప్పిదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాల‌ని బాబు డిమాండు చేశారు. జ్యుడీషియల్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు తీసుకోవాల‌న్నారు.  ప్రాజెక్ట్ గేటుకు గ్రీజ్ వేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారా? అని ప్ర‌శ్నించారు.