గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (13:25 IST)

'జవాద్' తుఫాను భయం : మూడు జిల్లాలకు అలెర్ట్ ... మానిటరింగ్ ఆఫీసర్లు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం కాస్త తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫానుకు జవాద్ అనే పేరు పెట్టనున్నారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా శుక్రవారం నుంచి ఏపీలోని విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆ జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. 
 
అలాగే, తుఫాను ప్రభావం అధికంగా ఉండే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ప్రత్యేక పర్యవేక్షక అధికారులను ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్ నియమించారు. శ్రీకాకుళంకు హెచ్. అరుణ్ కుమార్, విజయనగరంకు కాంతాలాల్ దండే, విశాఖ జిల్లాకు శ్యామలా రావును నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. 
 
ఈ అధికారులు తక్షణం ఆయా జిల్లాలకు వెళ్లి పరిస్థితులను సమీక్షించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా లోతట్టు, ముంపు ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత త్వరగా సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగా ఉండనుంది.