శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , మంగళవారం, 30 నవంబరు 2021 (11:25 IST)

జగనన్న పాల వెల్లువపై సీఎం దృష్టి... సమర్ధ నిర్వహణపై శిక్షణ

జ‌గ‌న‌న్న పాల వెల్లువ కార్య‌క్ర‌మంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమితాశ‌క్తితో సీరియ‌స్ గా ఉన్నార‌ని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు.  అందుకే రైతులంద‌రికీ దీనిపై శిక్ష‌ణ‌, నిర్వ‌హ‌ణ నైపుణ్యాల‌ను అందిస్తున్న‌ట్లు చెప్పారు. 
 
 
కృష్ణా జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 300 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ ప్రాజెక్టును సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లడానికి, అన్ని స్థాయిల్లో సమన్వయం ఎంతో అవసరమని కలెక్టర్ జె. నివాస్ అన్నారు. స్థానిక ఇరిగేషన్ కాంపౌండ్ లోని రైతు శిక్షణా కేంద్రంలో ఎంపిడివోలు, మెంటర్స్, జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుల‌కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయ‌న‌ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అంద‌రికీ మార్గదర్శనం చేశారు.

 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న పాలవెల్లువ నిర్వహణలో భాగంగా 260 మంది సెక్రెటరీలను, 43 మంది సహాయ సెక్రెటరీల నియామకానికి సంబంధించిన అంశాలను వివరించారు. వీరికి శిక్షణ అందించే సమయంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సంబంధిత  మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివరించారు.


జగనన్నపాల వెల్లువ కింద జిల్లాలో తొలి విడతలో 300 గ్రామాల్లో పాల సేకరణ చేపట్టేందుకు అవసరమైన కార్యచరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సెక్రెటరీల‌ విద్యార్హతతోపాటు, ఆమె ఆ గ్రామ కోడలు అయివుండి, స్థానికంగా నివసించే మహిళా కావాల‌న్నారు. వీరికి పాల సంఘం నిర్వహ‌ణ, ఏ యం సి యూ నిర్వహ‌ణపై శిక్షణ అందించాలన్నారు. ఇప్పటికే గ్రామాల‌ గుర్తింపు జరిగిందని, ఆర్బికే, దాని పరిధిలోని గ్రామం మిల్క్ రూట్ గుర్తించామ‌న్నారు. మెంటర్స్ మాపింగ్, రూట్ ఇంచార్జ్ కూడా పూర్తి అయ్యిందన్నారు.


గ్రామ వాలంటీర్ల ద్వారా చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేను పూర్తి చేసి, పాడి పశువులను కలిగిన మహిళలను గుర్తించి వారి వివరాలను త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. పాల సేకరణకు సంబంధించి వారికి అవగహన కోసం గ్రామ సభ నిర్వహించాలన్నారు. 
 
 
పాల సేకరణకు అవసరమైన రూట్, ఫంక్షన‌రీస్ మ్యాపింగ్ చేయాలన్నారు. కనీసం 18 ఏళ్లు 
వయసు నిండిన సొంత పాడి పశువు కలిగిన వారిని గుర్తించాలన్నారు. ముందుగా మహిళ డెయిరీ అసోసియేషన్ సెంటర్‌ను రిజిస్ట్రేషన్ చేసి, వాటి పనితీరు ఆధారంగా 90 రోజుల తరువాత మహిళ డెయిరీ సహకార సంఘంగా రిజిస్టర్ చేయాలన్నారు. పాలు పోసే వారు మాత్రమే ప్రమోటర్స్ గా ఉండాలని ఆయన సూచించారు. ఇందుకు పాల ఉత్పత్తిదారుల నుంచి 11 మందిని ప్రోమోటర్లగా నిర్ణయించుకోవాలన్నారు. జగనన్న పాల వెల్లువ మార్గదర్శకాలను క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన కలిగించాలన్నారు.
 
 
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు, డా. కె మాధవిలత, ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, సబ్
కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఆర్డీవో  కె.రాజ్యలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జెడి విద్యాసాగర్, పంచాయతీ రాజ్ ఎ వీరాస్వామి,  వ్యవసాయ శాఖ జెడి టీ మోహన్‌రావు, డిపివో ఏ డి.జ్యోతి, కెడిసిసిబి కె. చంద్రశేఖర్, సహకార, పాడి పరిశ్రమ తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.