ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (21:50 IST)

దేవుడే అన్నీ చేయిస్తాడు.. నా నోటి నుంచి నిజాలు చెప్పించాడేమో: చంద్రబాబు

babu cbn
తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టే పరమ పవిత్రమైన లడ్డూ తయారీకి రివర్స్ టెండర్లేంటని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. 
 
టీటీడీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చిస్తున్నామని, జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంప్రోక్షణ తీరుతెన్నులు ఎలా ఉండాలో సలహాలు తీసుకుంటామని చెప్పారు. 
 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమలపై దృష్టి సారించామని... టీటీడీని ప్రక్షాళన చేయాలని కొత్త ఈవోకు చెప్పానని స్పష్టం చేశారు. తిరుమల ఆలయం సెట్టింగ్‌ను ఇంట్లో వేసుకున్న వారిని ఏమనాలి? అంటూ ఎత్తిపొడిచారు. 
 
ఆచారాలను, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని హితవు పలికారు. అలాగే తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇప్పుడు ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడు నా నోటి నుంచి నిజాలు చెప్పించాడేమో, మనం నిమిత్త మాత్రులం, దేవుడే అన్నీ చేయిస్తాడు, ఇదీ అంతే అనుకుంటున్నా.." అని వ్యాఖ్యానించారు. 
 
"కేరళ గురువాయూర్ టెంపుల్‌లో దర్శనానికి చొక్కా విప్పి వెళ్లాలి. అది సాంప్రదాయం. అందరూ పాటించాలి. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరు గౌరవించాలి." అని బాబు అన్నారు.