శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (19:36 IST)

ఏడుకొండలవాడిని మేము దర్శించుకుని తీరాల్సిందే, కన్నీటి పర్యంతమైన భక్తురాలు

నాలుగు రోజులకు సరిపడా టోకెన్లను ఒకేసారి తితిదే ఇచ్చేసింది. అది కూడా 20వ తేదీ రాత్రికల్లా టోకెన్లను అందించేసింది. అయితే ఈ విషయం తెలియని భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకుంటున్నారు.
 
గత రెండురోజుల నుంచి శ్రీవారి భక్తుల ఆందోళనలతో అలిపిరి మారుమ్రోగుతోంది. నేరుగా గోవిందమాల భక్తులు అలిపిరి వద్దకు చేరుకుని గోవింద నామస్మరణలతో నిరసనకు దిగారు. అలిపిరి గరుడ విగ్రహం ముందే కూర్చుని వారంతా టోకెన్లు కావాలంటూ నినదించారు.
 
కొంతమంది గోవిందమాల భక్తులు తమ కాళ్ళకు ఉన్న బొబ్బలను చూపిస్తూ దర్సనం భాగ్యం కల్పించండి అంటూ టిటిడి సెక్యూరిటీని వేడుకున్నారు. ఓ మహిళ తను ప్రతి ఏటో వైకుంఠ ఏకాదశి నాడు ఆ ఏడుకొండలవాడిని దర్శించుకుంటాననీ, ఈ ఏడాది ఆ భాగ్యం నాకు కలగడం లేదంటూ కన్నీటి పర్యంతమైంది. అయితే ప్రత్యామ్నాయం లేదని... టోకెన్లు ఇవ్వలేమని సెక్యూరిటీ అధికారులు తేల్చేశారు. అయినా సరే భక్తులు వినిపించుకోకుండా రోడ్డుపైనే కూర్చుండిపోయారు. తీవ్రంగా కన్నీంటి పర్యంతమయ్యారు. 
 
అయితే ఇప్పటికే దర్సన టోకెన్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి జనవరి 3వ తేదీ వరకు స్థానికులకు మాత్రమే వైకుంఠ ఏకాదశి టిక్కెట్లను టిటిడి కేటాయించనుంది. ఇందులో స్థానికేతరులకు టోకెన్లు లేవు. ఈ విషయాన్ని భక్తులు గుర్తించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.