బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 22 నవంబరు 2021 (11:01 IST)

తిరుపతి రాయల్ చెరువు క‌ట్ట‌లు తెంచుకుంటోంది... త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

తిరుప‌తిలోని రాయ‌ల్ చెరువు పొంగి పొర్లుతోండ‌టంతో ఇక్క‌డి వ‌ర‌ద పరిస్థితిని రేయిబ‌వ‌ళ్ళు అధికారులు స‌మీక్షిస్తున్నారు. తిరుపతి అర్బన్ అర్బన్ యస్.పి వెంకట అప్పలనాయుడు, జిల్లా
కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ విభాగం అధికారులు, రెవెన్యూ అధికారులు రాత్రికి అక్కడే ఉండి పరిస్థితిని ఎప్ప‌టిక‌పుడు అంచ‌నా వేస్తున్నారు. 

 
శ్రీ కృష్ణదేవ రాయలు నిర్మించిన 358 హెక్టార్ల విస్తీర్ణంలోని రాయల చెరువు ఇటీవల కురిసిన తుఫాన్ వర్షాల కారణంగా పూర్తిగా నిండి, పొంగి పొర్లుతోంది. చెరువుకట్టకు ఉత్తరం వైపున (ఆంజనేయస్వామి గుడి వైపు) కట్ట కింది భాగంలో చెరువు నీరు లీకేజీని గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు. రాయల చెరువు కట్ట తెగిపోతుంది అన్న వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ సర్వత్రా ఆందోళ‌న‌క‌రంగా మారింది.
 
 
ఈ కట్ట తెగితే సమీపంలోని 18 గ్రామాలతోపాటు, వడమాలపేట మండలం వైపు పూడి వరకు పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి. భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. దీని తీవ్రతను గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అర్బన్ యస్.పి వెంకట అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఎం హరినారయన్ ప్రత్యేకాధికారి పీఎస్ ప్రద్యుమ్న,  జాయింట్ కలెక్టర్ రాజబాబు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు రాయల చెరువు వద్దకు చేరుకొని గండిని పూడ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చెరువు గట్టుకు పడ్డ గండికి అడ్డంగా ఇసుక మూటలను ఉంచి, చెరువు నుంచి వెలుపలకు వస్తుంది ప్రవాహాన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
 
 
రాత్రి పూర్తిగా చెరువు వద్దే ఉండి, రాయల చెరువు కట్ట తెగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టి, జరగబోయే విపత్తులు ఆపడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. చెరువు గట్టు వద్ద ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టారు. ముంపునకు గురి కాబోయే 18 గ్రామాల ప్రజలను తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయంకు బస్సుల ద్వారా తరలించారు. గ్రామాలన్నీ పూర్తిగా ఖాళీ అయ్యాయి.
 
రెండు ఎన్.డి.అర్.ఎఫ్.,  ఎస్.డి.అర్.ఎఫ్ బృందాలు చెరువు గట్టు వద్ద సహాయక చర్యలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి, వీటితో పాటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఆరు అంబులెన్సులను అవసరమైతే ఉపయోగించడానికి రామాపురం వద్ద సిద్ధంగా ఉంచారు. ప్రతి గ్రామంలో పోలీసులను పరిస్థితిని అంచనా వేయడానికి, అధికారులకు సమాచారం అందించడానికి ఏర్పాటు చేశారు. చెరువు కట్ట తెగితే అవకాశాలు తక్కువగా ఉన్నాయని స్థానికులు ధీమా వ్యక్తం చేస్తున్న అధికారులు ఏ మాత్రం  నష్టం జరగడానికి అవకాశం ఇవ్వకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.

 
ఉన్నతాధికారుల బృందం మొత్తం చెరువు గట్టు పైన నిలబడి ఎప్పటికప్పుడు గండి పడిన ప్రాంతం నుంచి సన్నగా వస్తున్నా వస్తున్న నీటి ప్రవాహాన్ని, దాన్ని అరికట్టడానికి అవసరమైన చర్యలను చేపట్టారు. 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు పటిష్టంగా నిర్మించిన ఈ కట్ట అంత సులభంగా తగదని పూర్వ అనుభవంతో స్థానిక గ్రామాల ప్రజలు చెప్పినప్పటికీ, నష్టం జరగకముందే చర్యలు చేపట్టడంమంచిదని అధికారులు భావిస్తున్నారు.