శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (17:23 IST)

తిరుపతి లోక్‌సభ : వైకాపా అభ్యర్థి ఘన విజయం

ఏపీలోని తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైకాపా ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,65,988 ఓట్లతో తిరుగులేని మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి 6,11,1116 ఓట్లు పోలవగా, తెలుగుదేశం పార్టీకి 3,45,128 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ డిపాజిట్‌ గల్లంతయ్యింది. ఆ పార్టీ 56,035 ఓట్లు మాత్రమే సాధించగలిగింది.
 
గత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ నుంచి బల్లి దుర్గాప్రసాద్‌ గెలుపొందారు. గతేడాది ఆయన కరోనాతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 17న ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ టీడీపీ నుంచి మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీచేశారు. 
 
ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ ఆధిక్యం ప్రదర్శించి. ప్రతి రౌండ్‌లో మెజారిటీ పెంచుకుంటూ పోయింది. ఓట్ల లెక్కింపు సగం పూర్తయ్యేవరకు ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి.. ప్రత్యర్థికి అందనంత మెజారిటీలో నిలిచి గెలపు ఖాయం చేసుకున్నారు. మొత్తంగా వైసీపీకి 57 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి.