శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (07:42 IST)

తిరుపతిలో విషాదం : కరోనా టీకా వేసుకున్న పారిశుద్ధ్య కార్మికుడి మృతి

తిరుపతిలో విషాదం జరిగింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. తిరుపతి, మల్లంగుంట పంచాయతీలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఆర్ కృష్ణయ్య (49) అనే పారిశుద్ధ్య కార్మికుడు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో టీకా తీసుకున్నాడు. 
 
అర్థగంటపాటు ఎలాంటి సమస్య లేకపోవడంతో టీకాలు వేస్తున్న ఎంపీడీవో కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం ఇంటి వద్ద కళ్లు తిరిగి కిందపడిపోవడంతో వెంటనే అతడిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
 
కృష్ణయ్య మరణంపై అతడి కుమారుడు తిరుమల మాట్లాడుతూ, తన తండ్రికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నాయని, అయినప్పటికీ టీకా వేశారని ఆరోపించారు. పోస్టుమార్టం అనంతరం కృష్ణయ్య మృతికి కారణం తెలుస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.