ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (11:45 IST)

మరో వైకాపా నేత రాజీనామా.. జిల్లా అధ్యక్ష పదవికి కాపు గుడ్‌బై

ysrcp flag
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల వేడి మెల్లగా రాజుకుంటుంది. అదేసమయంలో అధికార వైకాపాలో ముసలం చెలరేగుతుంది. ప్రభుత్వంతో పాటు అధికార పార్టీ నేతల్లో ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించిన పలువురు వైకాపా నేతలు తమ తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. 
 
ఇటీవలే గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్ష పదవికి మాజీ హోం మంత్రి సుచరిత రాజీనామా చేశారు. ఇపుడు అదే బాటలో మరో నేత నడిచారు. అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడు, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు. ఇందులో తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. 
 
ఇటీవల కాపు రామచంద్రారెడ్డి కుమార్తె భర్త, తన అల్లుడు మంజునాథ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదం నుంచి గట్టెక్కేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం తనకు కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. 
 
పైగా ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంపై దృష్టిసారించాల్సి అవసరం ఎంతైనా ఉన్నందున పార్టీ అధ్యక్ష బాధ్యతలను తాను పర్యవేక్షించలేని, ఆ పదవిని మరో వ్యక్తికి ఇవ్వాలని కాపు రామచంద్రారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.