శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 22 ఆగస్టు 2019 (14:43 IST)

విఐపీనా...? ఐతే ఓకే లేదంటే డస్ట్ బిన్‌లో వేయండి.. ఎవరు? ఏమిటి?

విఐపీ లెటరా... తిరుమల శ్రీవారి దర్శనం కోసమా.. అతడి ల్యాండ్ లైనుకు ఫోన్ చేయండి. ఆఫీసులో వాకబు చేయండి. నిజంగా ఈ మనిషి ఆ మనిషేనా... నిజంగా వీఐపీయేనా... ఐతే ఓకే. లేదంటే ఆ లెటర్‌ను డస్ట్ బిన్‌లో వేసి వచ్చినవారిని వెనక్కి తిప్పి పంపేయండి. వారికి శ్రీవారి దర్శనం దుర్లభం. ఇదీ తిరుమల కొండ పైన ప్రస్తుత పరిస్థితి.
 
వై.ఎస్.ఆర్. ప్రభుత్వం వచ్చిందే టిటిడిలో ప్రక్షాళన తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ టిటిడి అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు జగన్‌ను ఎన్నికలకు ముందు కలిసిన సమయంలోనే ఈ విషయాన్ని జగన్ చెప్పారు. అనుకున్న విధంగానే టిటిడి ఛైర్మన్‌గా చిన్నాన్న వై.వి.సుబ్బారెడ్డిని నియమించారు.
 
ప్రక్షాళన దిశగా టిటిడిని ముందుకు తీసుకెళుతున్నారు. అందులోను టిటిడి ప్రత్యేక అధికారిగా ధర్మారెడ్డిని నియమించిన తరువాత ఆయనతో కలిసి వై.వి.సుబ్బారెడ్డి పూర్తిస్థాయిలో దళారీల పనిపట్టడమే ప్రధాన కర్తవ్యంగా నిమగ్నమయ్యారట. ఇందులో భాగంగా ఇప్పటికే రాజకీయ నేతల సిఫార్సుల లేఖలను బాగా కుదించేశారు. ఎవరైతే ప్రముఖులు వస్తారో.. వారి సెల్ఫ్ పేరుతో ఉంటేనే ధరఖాస్తులను తీసుకుంటున్నారు. కానీ ప్రముఖులు రెకమెండేషన్ చేసే వారి ధరఖాస్తులను మాత్రం అస్సలు తీసుకోవడం లేదు.
 
మీడియా పరిస్థితి కూడా అంతే. మీడియాలో కూడా కొంతమంది దళారులు ఉన్నారన్న విషయాన్ని గుర్తించిన టిటిడి ఛైర్మన్ వారి లేఖలను తీసుకోవడం పూర్తిగా పక్కన పెట్టించేశారు. టిటిడి జెఈఓ కార్యాలయం నుంచే ఈ ప్రక్షాళన మొత్తం ప్రారంభమైంది. తిరుమలలో జరుగుతున్న పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి వాకబు చేశారట. వై.వి.సుబ్బారెడ్డి బాగా పనిచేస్తున్నారని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి బాగా చేస్తున్నారంటూ ప్రశంసించారట. జగన్ పొగడ్తలతో టిటిడి ఛైర్మన్ కూడా సంతోషం వ్యక్తం చేశారట.