గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (10:31 IST)

తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు నోటీసులు పంపండి : హైకోర్టు ఆదేశం

ramana deekshithulu
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మాజీ ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 
 
సామాజిక మాధ్యమాల వేదికగా శ్రీవారి ఆలయం, తితిదే అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తితిదే ఐటీ శాఖకు చెందిన మురళీ సందీప్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుమల పోలీసులు రమణదీక్షితులుపై ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రమణదీక్షితులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. 
 
అయితే, పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవేనని విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. 41ఏ నోటీసు నిబంధనను పాటించాలని పోలీసులను ఆదేశించారు. ఒకవేళ పోలీసులు ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేస్తే దానిని సవాలు చేసుకునే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇస్తూ వ్యాజ్యంపై విచారణను మూసివేశారు.