శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:34 IST)

టీటీడీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ పని తీరు మెరుగు

గడిచిన రెండు మూడు నెలలుగా, కోవిడ్ కారణంగా తిరుమ‌ల ద‌ర్శ‌నం కోసం విడుదల చేసిన టిక్కెట్లు పరిమితం చేశారు. ఇది త‌క్కువ సంఖ్యలో ఉండడం వల్ల పోటీ పెరిగి, చాలా మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి  లక్షలాదిగా బుకింగ్ కి లాగిన్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో టీటీడీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 
 
దీనిని అతిక్రమించడం కోసం ఉన్న అతి తక్కువ సమయంలో వివిధ మార్గాలను అన్వేషించి, సాంకేతిక నిపుణుల సూచనలు పరిగణలోకి తీసుకుని ఎ.డ‌బ్ల్యూ ఎస్. క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కి వెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ఆ సమయంలో జియో యాజమాన్యం వారు తిరుమల శ్రీవారికి సేవలా భావించి, అన్నీ తామై సుమారు 2, 3 కోట్ల రూపాయల విలువ చేసే సర్వీస్ ను ఉచితంగా అందించారు.  
 
ఈ రోజు అనగా 24వ తేదీ తొమ్మిది గంటలకి తొలిసారిగా జియో క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసిన సమయంలో కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినా వెంటనే తగు చర్యలు చేపట్టి పరిష్కరించారు. సుమారు గంట సమయంలోనే రెండు ల‌క్ష‌ల టికెట్లు బుక్ చేసుకోగలిగారు.
 
తక్కువ సమయం ఉండటం కారణంగా తిరుపతి బాలాజీ పేరుతో సబ్ డొమైన్ తీసుకురావడం కుదరదు.  కాబ‌ట్టి జియో వారి సాఫ్ట్వేర్ మరియు క్లౌడ్ వాడుకుని టీటీడీ అఫీషియల్ వెబ్ సైట్ ని ల్యాండింగ్ పేజీ గా వాడుకుని జియో మార్ట్ సబ్ డొమైన్ కి రూట్  చేయడం జరిగింది. తదుపరి టికెట్ల విడుదల సమయంలో ఈ సబ్ డొమైన్ కూడా తిరుపతి బాలాజీ పేరుతో ఉండబోతుంది.