ఏపీలో కరోనా కలకలం.. ఆ రెండు నగరాల్లో కొత్త కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కలకలం చెలరేగింది. తాజాగా విశాఖపట్టణం, తిరుపతి నగరాల్లో కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో బాధితుల నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం విజయవాడకు తరలించారు. ఈ రెండు కేసుల్లో ఒకటి విశాఖపట్టణంలో నమోదు కాగా, మరొకటి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో వెలుగు చూసింది.
చిత్తూరు జిల్లా వాసికి తాజాగా కుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా, అక్కడ కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అదే రోజు రాత్రి ఆ వ్యక్తిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐడీహెచ్ వార్డులో కోవిడ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించారు. ఆయనకు మంగళవారం ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించారు. మరోవైపు, మంగళవారం మధ్యాహ్నం బాధితుడు ఎవరికీ చెప్పకుండా పత్తాలేకుండా పారిపోయాడు. దీంతో వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, పోలీసు సాయంతో అతని కోసం గాలిస్తున్నరు.
అలాగే, విశాఖపట్టణం రైల్వే న్యూ కాలనీకి చెందిన 42 యేళ్ళ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఆయనలో జ్వరం, ఇతర కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యుల సూచన మేరకు ఆరిలోవ హెల్త్ సిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పైగా, ఈయన విదేశాల్లోకు వెళ్లివచ్చినట్టు ట్రావెల్ హిస్టరీ లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.