శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (09:04 IST)

జగన్ సర్కారుకు షాకిచ్చిన కేంద్రం - ఒకే రాజధానికి నిధులిస్తాం

amaravati capital
ఏపీలోని వైకాపా ప్రభుత్వానికి కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. నవ్యాంధ్ర రాజధానికి ఒక్క రాజాధానిని నిర్మించడానికే అపసోపాలు పడుతున్నారు. అలాంటిది సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. గత మూడేళ్లుగా దీంతోనే సాగదీస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కారుకు తేరుకోలేని షాకిచ్చింది. 
 
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ ప్రభుత్వం ఊదరగొడుతున్న నేపథ్యంలో, రాష్ట్రాల రాజధాని ఒక్కటేనని కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. 'నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్రం మద్దతు' అని అధికారిక పత్రాల ద్వారా స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ఈ నెల 27న కేంద్ర హోం శాఖ సమావేశాన్ని నిర్వహించనుంది. 
 
ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో జరగనున్న భేటీలో ఏపీ, తెలంగాణ, ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులు పాల్గొంటారు. 14 అంశాలతో ఖరారైన ఎజెండాతో కూడిన సమాచారాన్ని రెండు రాష్ట్రాలు, ఆయా మంత్రిత్వ శాఖలకు కేంద్ర హోం శాఖ డైరెక్టర్ పార్థసారథి పంపించారు. 
 
ద్వైపాక్షిక అంశాలు, ఇతర అంశాల పేరిట అంశాలను రెండుగా విభజించారు. ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన, ఏపీ రాజధానికి నిధులు, విద్యా సంస్థల ఏర్పాటుపై చర్చించడానికి రావాల్సిందిగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆర్థిక, ఆహార, విద్యా, వ్యవసాయ, పెట్రోలియం, ఆరోగ్య శాఖల కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు ఛైర్మన్‌కు కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపించింది. 
 
ఎజెండాలో నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్రం మద్దతు అంశం ఉంటుందని స్పష్టం చేసింది. నూతన రాజధానికి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ కల్పించడం అనే అంశాన్ని కూడా ఎజెండాలో పేర్కొంది. జగన్ సర్కార్ పదే పదే చెబుతున్నట్లుగా 3 రాజధానులు అని కాకుండా 'నూతన రాజధాని' అని ఒకే రాజధానిగా అర్థం వచ్చేలా ఎజెండాలో చేర్చడం గమనార్హం.