శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (23:09 IST)

ఏపీలో వైకాపా కౌన్సిలర్ అరెస్టు... ఎందుకంటే?

cbi office
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు, కార్యకర్తలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోతున్నారు. వీరికి పోలీసులు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు. వైకాపా నేతలు దాడి చేసినా.. బాధిడిపైనే కేసులు నమోదు చేస్తున్నారు. చివరకు వైకాపా కార్యకర్తలు న్యాయమూర్తులను కూడా వదిలిపెట్టలేదు. తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన జడ్జీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. 
 
ఈ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే, సీబీఐ కూడా అధికార ఒత్తిడికి తలొగ్గి ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించింది. అయితే, హైకోర్టు సీరియస్‌ వార్నింగ్ ఇవ్వడంతో సీబీఐ అధికారులు తమ నిద్రమత్తును వీడారు. హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైకాపా నేతలను ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తున్నారు. 
 
తాజాగా సత్యసాయి జిల్లా పరిధిలోని హిందూపురం మునిసిపాలిటీ కౌన్సిలర్, వైకాపా నేత మారుతీ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసారు. ఈ కేసు విషయంలో మారుతీ రెడ్డి వద్ద గతంలో రెండు సార్లు విచారణ జరిపింది. తాజాగా ఆయన్ను అరెస్టు చేసింది. 
 
వైకాపా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై పిటిషన్లు దాఖలు కాగా, వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు వాటిలో చాలా వాటిని కొట్టివేసింది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌డ్జీల‌పై అనుచిత వ్యాఖ్య‌లు పోస్ట‌య్యాయి. 
 
ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టు ఆదేశాల‌తో సీబీఐ ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో సోమ‌వారం ఓ మ‌హిళ స‌హా ఏడుగురు వ్య‌క్తుల‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ మ‌రునాడే వైసీపీ కౌన్సిల‌ర్ మారుతీ రెడ్డిని అరెస్ట్ చేయడం గమనార్హం.