శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (19:34 IST)

ఎస్పీబాలు ఆస్పత్రి బిల్లులు చెల్లించిన ఉపరాష్ట్రతి కుమార్తె?!

గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగస్టు ఐదో తేదీన ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల తర్వాత ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటిలేటర్‌తో పాటు ఎక్మో సపోర్టుతో చికిత్స అందిస్తూ వచ్చారు. అలా ఏకంగా 50 రోజుల పాటు ఎస్పీ బాలు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు చేయని ప్రయత్నంటూ లేదు. కానీ, బాలు గత శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఎస్పీ బాలు చికిత్స కోసం అయిన వైద్య ఖర్చులన్నీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ చెల్లించినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
 
వీటిపై దీపా వెంకట్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. అవన్నీ నిరాధారమైన వార్తలు, అలాంటి వార్తలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పైగా, ఎస్పీబాలు తమ కుటుంబానికి ఎంతో కావాల్సిన వ్యక్తని, అందుకే ఆయన ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ చూపించారని చెప్పారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన దక్కకుండా పోయారని చెప్పారు. అంతేకాకుండా ఎస్పీబాలు చికిత్స కోసం అయిన ఆస్పత్రి బిల్లులు తాము చెల్లించలేదని స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా, ఎస్పీ బాలు కుటుంబం కూడా ఎలాంటి బిల్లులు చెల్లించాల్సిన పనిలేదని ఎంజీఎం ఆస్పత్రి కూడా స్పష్టం చేసిందని తెలిపారు. అదేసమయంలో ఎస్పీ బాలు ఆరోగ్యం గురించి ఎప్పటికపుడు తన తండ్రి వెంకయ్య నాయుడికి ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు సమాచారం ఇస్తూ వచ్చారని ఆమె క్లారిటీ ఇచ్చారు.