గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జనవరి 2024 (15:01 IST)

ఏపీ మంత్రి రజని కార్యాలయంపై రాళ్లతో దాడు... ఎందుకు?

vidadala rajani
గుంటూరు జిల్లా విద్యా నగరులో ఏపీ మంత్రి రజనీ కార్యాలయంపై టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు రాళ్ళదాడికి దిగారు. ఈ దాడిలో ఆమె కార్యాలయ అద్దాలు పగిలిపోయాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రాళ్లదాడికి పాల్పడిన వారిలో పలువురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈ కార్యాలయానికి కూడా పోలీసులు భద్రత కల్పించారు. 
 
మంత్రి రజినీని గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. దీంతో ఆమె గుంటూరు విద్యా నగరులో ఆమె కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం ఉదయం ఈ ఆఫీస్ ప్రారంభోత్సవం జరగాల్సివుంది. అయితే, ఆదివారం అర్థరాత్రి ఈ కార్యాలయంలో టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు రాళ్ళతో దాడి చేశారు. 
 
రజనీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన టీడీపీ కార్యకర్తలు ఆపై ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టి, రాళ్ల దాడికి పాల్పడిన వారిలో కొందరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ఘటనపై రజినీ స్పందిస్తూ, కావాలనే తన కార్యాలయంపై దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుందన్నారు. అద్దాలను పగులగొట్టిన పెద్ద రాళ్లను చూపిస్తూ ఇంత పెద్ద రాళ్లు రాత్రికి రాత్రి ఎలా వస్తాయని, దాడి చేయాలని ముందస్తుగానే ప్లాన్ చేసుకుని దాడికి పాల్పడ్డారని చెప్పారు. దాడికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మరోవైపు, రజనీ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.