రంగా కుటుంబం పుట్టినప్పుడు మంత్రి వెల్లంపల్లి పుట్టి ఉండడు...
విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జాగ్రత్తగా ఉండాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని సూచించారు. వంగవీటి రాధాను ఆయన నివాసంలో కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఇతర టీడీపీ నేతలు పరామర్శించారు.
రాధాపై రెక్కీ నిర్వహించిన నేపధ్యంలో ఎంపీ నాని, మాజీ మంత్రి నెట్టెం రఘురాం రాధాను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని రాధాకు సూచించారు. వంగవీటి కుటుంబం రాష్ట్ర సంపద అని, పేద ప్రజలకు వంగవీటి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని ఎంపీ కేశినేని నాని అన్నారు. హత్యా రాజకీయాలను ఎప్పుడు, ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు ఎప్పుడు ప్రోత్సహించ లేదని కేశినేని నాని చెప్పారు.
వంగవీటి రాధా మంచి వ్యక్తి అని, రాధా తాను నష్టపోతాడు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడన్నారు. విజయవాడ నగరాన్ని డిజిపి, సీపీ ప్రశాంతంగా ఉంచాలని, రాధా రెక్కీ అంశంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలన్నారు. తాను ఢిల్లీ వెళ్ళినపుడు కేంద్ర పెద్దలను కలుస్తానని, అలాగే ఇపుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఎంపీగా లేఖ రాస్తానన్నారు.
కేంద్ర హోంమంత్రి దృష్టికి రాధాపై రెక్కీ అంశాన్ని తీసుకువెళ్తానని కేశినేని నాని చెప్పారు. పాత బెజవాడ రోజులు తీసుకురావద్దని పోలీసులను కోరుతున్నా, పదవులు ఆశించే వ్యక్తిత్వం రాధాది కాదు... వంగవీటి కుటుంబం రాజకీయాలు ఉన్నంత వరకు తెరమరుగు అవ్వదు. రంగా కుటుంబం పుట్టినప్పుడు మంత్రి వెల్లంపల్లి పుట్టి ఉండడు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు.