అమ్మ అక్రమ సంబంధానికి బాలిక బలైంది...
అమ్మ అక్రమ సంబంధానికి ముక్కుపచ్చలారని బాలిక బలైంది. విజయవాడ రూరల్ పరిధిలోని గొల్లపూడిలో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఎనిమిదేళ్ళ చిన్నారి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. పాత నేరస్తుడు ఈ హత్యకు పాల్పడినట్టు తొలుత పోలీసులు భావించారు. కానీ, పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడితో బాలిక తల్లి సాగిస్తూ వచ్చిన అక్రమ సంబంధమే కుమార్తె హత్యకు దారితీసిటనట్టు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. దీంతో నిందితుడు, బాలిక తల్లి మొబైల్ ఫోన్ సంభాషణలను ఆరా తీస్తున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ రూరల్ పరిధిలోని గొల్లపూడికి చెందిన మొవ్వ అనిల్, వెంకటరమణ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరూ గొళ్లమూడిలో చదువుకుంటుండగా, కుమార్తె (8) గొల్లపూడిలోనే రెండో తరగతి చదువుతోంది. అనిల్ ప్రభుత్వ మద్యం సరఫరా గోదాంలో పని చేస్తుండగా, వెంకటరమణ.. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు కాలేజీలో స్వీపర్‌గా పని చేస్తోంది.
అయితే వెంకటరమణ ఇంటి పక్కనే ఉన్న పెంటయ్య అలియాస్ ప్రకాశ్‌తో అక్రమ సంబంధం నెరపుతూ వచ్చింది. ఓ రోజున అతనితో సన్నిహితంగా ఉండటాన్ని ఎనిమిదేళ్ళ కుమార్తె చూసింది. దీంతో తల్లిని బాలిక ప్రశ్నించింది. నాన్నకు చెబుతానని బెదిరించింది. తమ ఇద్దరి వ్యవహారం బయటపడే ప్రమాదం ఉందని భావించిన వెంకటరమణ తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ తర్వాత ప్రియుడుతో కలిసి బిడ్డను చంపాలని తల్లి ప్లాన్ వేసింది.
అంతే.. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా పెంటయ్య ఆ చిన్నారని చంపి ఓ బస్తాలో చుట్టిపెట్టాడు. ఆ తర్వాత ఆదివారం సాయంత్రానికి వెంకటరమణ తన ఇంటికి వచ్చింది. తన కుమార్తె ఎక్కడ అంటూ భర్త అనిల్‌ను ప్రశ్నించింది. ఆడుకునేందుకు బయటకు వెళ్లి ఉండొచ్చు.. వస్తదిలే అని అనిల్ సమాధానమిచ్చాడు. రాత్రి అయినా కూడా బాలిక ఇంటికి రాకపోవడంతో ఏమీ తెలియనట్లు వెంకటరమణ, పెంటయ్య కూడా బాలిక ఆచూకీ కోసం గాలించసాగారు. గ్రామం మొత్తం వెతికారు. పెంటయ్య కూడా వెతకడంతో అతనిపై అనుమానం రాలేదు.
అయితే, పెంటయ్య భార్య సునీత ఆదివారం సెలవు దినం కావడంతో తన బంధువుల ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం ఇంటికొచ్చింది. ఇంట్లో బెడ్ కింద ఉన్న మూటను గమనించిన సునీత.. తెరిచి చూడగా అందులో బాలిక మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారం చేరవేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పెంటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటరమణ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఆరా తీస్తున్నారు.