సోమవారం, 14 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (15:04 IST)

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

Vallabhaneni Vamsi
గన్నవరం టీడీపీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక కోర్టు మరోమారు షాకిచ్చింది. ఈ కిడ్నాప్ కేసులో వంశీకి రిమాండ్‌ను ఈ నెల 22వ తేదీన పొడగించింది. వంశీకి విధించిన రిమాండ్ మంగళవారంతో ముగియడంతో ఆయనను పోలీసుల కోర్టు ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ పొడిగించడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. 
 
గన్నవరం టీడీపీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ, వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లంతా ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. 
 
ఈ కేసులో మిగిలిన నిందితులు నేపాల్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మా కోటేశ్వర రావు అలియాస్ కోట్లు ఒకరు. నేపాల్‌లో కోట్లుతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. అక్కడి నుంచి వీరు రాత్రి సమయాల్లో సన్నిహితులకు ఫోన్లు చేస్తూ కేసు విషయాలను, పోలీసుల కదలికలను తెలుసుకుంటున్నారు. ఈ నలుగురూ నేపాల్‌లో ఎక్కడ తలదాచుకున్నారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.