శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 12 జనవరి 2022 (16:01 IST)

గుంటూరులో ఐటీసీ వెల్‌కం హోటల్‌ని ప్రారంభించిన సీఎం జగన్‌

గుంటూరుకు ఐటీసీ వెల్‌కం హోటల్‌ని తీసుకొచ్చిన ఐటీసీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజివ్‌ పూరికి సీఎం వైయస్‌.జగన్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఐటీసీతో భాగస్వామ్యం గుంటూరులో వెల్ కం స్టార్ హోట‌ల్ ని సీఎం ప్రారంభించారు. గుంటూరులాంటి పట్టణంలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఉండటం, అలాంటి ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఐటీసీ భాగస్వామ్యం కావడం మంచి పరిణామం అన్నారు. ఐటీసీ భాగస్వామ్యంతో  వ్యవసాయ రంగంలో ప్రత్యేకంగా పుడ్‌ ప్రాససింగ్‌లో ముందుకు పోతున్నామ‌ని, ఆంధ్రప్రదేశ్‌లో ఏ గ్రామానికి వెళ్లినా మీరు మూడు రంగాల్లో సమూలమైన మార్పులు చూస్తార‌ని సీఎం తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మీరు ఈ మార్పులు గమనించవచ్చ‌న్నారు. 
 
 
వ్యవసాయరంగంలో ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు(ఆర్బీకేలు) ఉన్నాయి. దాదాపు 10,700 ఆర్బీకేలు రైతులను విత్తనం నుంచి విక్రయం వరకు చేయిపట్టుకుని నడిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో సమూల మార్పులే ఆర్బీకేల ప్రధాన లక్ష్యం. గ్రామస్ధాయిలో వ్యవసాయరంగంలో ఏ రకమైన మౌలిక సదుపాయలను ప్రైమరీ ప్రాససింగ్‌ లెవల్‌లో కల్పించాం, ఇంకేం కల్పించాలన్నది చాలా ముఖ్యమైన అంశం. పార్లమెంట్‌ నియోజకవర్గ స్ధాయిలో సెకండరీ ప్రాససింగ్‌ లెవల్‌లో ఏర్పాటు కానున్నాయి. ఈ విషయంలో ఐటీసీ కూడా ముందుకు వచ్చి భాగస్వామ్యం కావడం ద్వారా కీలకమైన పాత్ర పోషించనుంద‌ని సిఎం తెలిపారు.
 
 
గుంటూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్‌లో తొలి లీడ్‌ ప్లాటినం సర్టిఫైడ్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్ ఐటిసి వెల్ కం హోట‌ల్ కావడం సంతోషించతగ్గ విషయం అని సీఎం చెప్పారు. ఐటీసీతో ఇంకా మరింత దృఢంగా, పెద్ద ఎత్తున భాగస్వామ్యులవుతున్నామ‌ని, ప్రధానంగా పర్యాటక, వ్యవసాయ, పుడ్‌ ప్రాససింగ్‌ రంగాల్లో ఐటీసీతో భాగస్వామ్యం దీర్ఘకాలం కొనసాగుతుందని జగన్ చెప్పారు.  
 
 
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, గృహనిర్మాణశాఖమంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.