ఏపీ నూతన సీఎస్ శ్రీలక్ష్మే!?
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో ఏపీకి కొత్త సీఎస్‌గా ఎవరికి అవకాశం దొరుకుతుందన్న అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది.
సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు అర్హత కలిగిన అధికారుల జాబితా పెద్దగానే ఉన్నా.. వైఎస్సార్ హయాంలో వెలుగు చూసిన గనుల కుంభకోణంలో ఏకంగా జైలు జీవితం గడిపి తన కెరీర్ నే ప్రమాదంలోకి నెట్టేసుకున్న మహిళా ఐఏఎస్ వై.శ్రీలక్ష్మికి పదవి దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలుస్తోంది.
దాస్ కంటే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం ఏపీ ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్న నీలం సాహ్నీ భర్త అజయ్ సాహ్నీ.. ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. 1984 బ్యాచ్ కు చెందిన అజయ్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. నీలం మాదిరే.. సీఎస్ పోస్టిస్తామంటే మరోమారు రాష్ట్ర సర్వీసులకు వచ్చేందుకు ఆయన సుముఖంగానే ఉన్నారు.
కానీ తన వల్ల ఇబ్బంది పడిన శ్రీలక్ష్మి కే అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ కేసుల మాదిరే బళ్లారి అక్రమ మైనింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలక్ష్మి చాలా కాలం పాటు జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జగన్, సాయిరెడ్డిలకు త్వరగానే బెయిల్ దక్కినా.. శ్రీలక్ష్మి మాత్రం బెయిల్ కోసం చాలా కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది.
భర్త సీనియర్ ఐపీఎస్ అధికారి అయినా కూడా శ్రీలక్ష్మీ కటకటాల్లోనే మగ్గిపోయారు. చివరకు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురైన ఆమెకు కోర్టు మానవతా దృక్పథంతోనే బెయిల్ మంజూరు చేసింది.
ఆ తర్వాత జగన్ ఏపీకి సీఎం అయిన వెంటనే.. ఆయనతో శ్రీలక్ష్మి భేటీ కావడం, ఆమెను ఏపీ కేడర్ కు తీసుకునేందుకు జగన్ ఆసక్తి చూపడం, అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఓకే అనడం.. ఏడాది తర్వాత అయినా కేంద్రం కూడా ఓకే అనడం అలా వరుసగా జరిగిపోయాయి.
ఇప్పుడు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి ఏపీ కేడర్ కు వచ్చీ రాగానే రెండు సార్లు ప్రమోషన్లు దక్కాయి. ఈ పరిణామ క్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. జగన్ ఛాయిస్ శ్రీలక్ష్మే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.