1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 20 డిశెంబరు 2021 (10:22 IST)

అమరావతి ఉద్యమంలో దొంగలు పడ్డారా? ప‌వ‌న్, వీర్రాజు ఎందుకు రాలేదు?

అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మంలో దొంగ‌లు పడ్డార‌ని ప‌లువురు రాజ‌కీయ ప‌రిశీల‌కులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నో రోజుల ఉద్య‌మం త‌ర్వాత‌, ముగింపు స‌భ తిరుపతిలో నిర్వ‌హించే ముందే, ఎవ‌రు దీనికి రావాలి? ఎవ‌రు వ‌ద్ద‌నే ముంద‌స్తు ప్లానింగ్ జ‌రిగిపోయింద‌ని చెపుతున్నారు. బహిరంగ సభలో అమరావతి ఉద్యమం ముసుగులో దొంగలు ప్రవేశించి, రాజధాని సాధన లక్ష్యాన్ని దెబ్బతీశారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి) అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణ చేసారు.
 
 
అమరావతే  రాష్ట్ర ఏకైక  రాజధానిగా కొనసాగాలని ఏడాదికి పైగా కొనసాగుతున్న చారిత్రాత్మక ఉద్యమాన్ని కొంత మంది స్వలాభం కోసం ఉద్యమ లక్ష్యాన్ని ప్రక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తిరుపతి వేదికగా తలపెట్టిన భహిరంగ సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బిజెపి మిత్రపక్షం అయిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన పోవటానికి గల కారణాల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి సభ నిర్వాహకుల వైఖరే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 13 జిల్లాల నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో సభ నిర్వాహకులు వ్యూహాత్మకంగానే నిర్లక్ష్యం చేసారని, సభా వేదికపై అమరావతి ఉద్యమంలో ముందు నుండి చిత్తశుద్ధితో పనిచేసిన అతి కొద్ది మంది మినహాయిస్తే, అత్యధిక శాతం ఉద్యమ ద్రోహులే ఉపన్యాసాలు గుప్పించార‌ని పేర్కొంటున్నారు. ఈ రైతుల సభలో ప్రసంగించటానికి సినీ నటుడు శివాజికి ఏ అర్హత ఉందని మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. 
 
 
తిరుపతి బహిరంగ సభలో సిపిఎం పాల్గొనలేదు. బిజెపితో తాము వేదిక పంచుకోలేం అని  బాహాటంగా తెలిపిన మధు నిజాయితీని అభినందించాల్సిందే అంటున్నారు. బిజెపి సుప్రీంలలో ఒకరైన అమిత్ షా అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలవండి అని ఆదేశించినా, బిజెపి, జనసేన పెడచెవిన పెట్టిన వైనం అనేక అనుమానాలుకు తావు నిస్తోంది. కన్నా లక్ష్మి నారాయణ బిజెపి నుండి హాజరయ్యారో, గుంటూరు వాసిగా హాజరయ్యారో, మరో రాజకీయ వ్యూహంతో హాజరయ్యారో సందేహమే అంటున్నారు. ఇక మరో ఎంపి రఘురామ్ కృష్ణరాజు వైసిపి అడ్రస్ తో హాజరయ్యారని, అలాంటప్పుడు అధికార పక్షం మద్దతు  ఉందనుకోవాలా? అనే ఆంధ్రుల సందేహానికి నిర్వాహకులు వివరణ ఇవ్వాలన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏకైక రాజధాని అని సభ నిర్వాహకులు మరిచి పోవటం దురదృష్టం అని ఆయన తెలిపారు. 
 
 
అమరావతి ఉద్యమం ప్రారంభం నుండి ఓకే రాష్ట్రం, ఓకే రాజధాని, 13 జిల్లాల అభివృద్ధి అంటూ,  ప్రత్యేక తరగతి హోదా, రాయితీలతో కూడిన విభజన హామీల కోసం  అవిశ్రాంతంగా  పోరాడుతున్న జెడిఎఫ్ సంస్థ, ప్రత్యేక హోదా ఆత్మగౌరవ పోరాట కమిటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టి , ఆమ్ ఆద్మీ పార్టి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)పార్టి , అమరావతిపై చారిత్రాత్మక పుస్తకం అచ్చు వేయించిన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి చైర్మన్ బైరాపునేని సూర్యనారాయణ, మరికొంత మంది ఉద్యమ కారులను, ఉద్యమ సంస్థలను తిరుపతి సభకు ఆహ్వానించక పోవటం వెనుక రాజకీయ స్వార్థ ప్రయోజనాలు కారణంగా భావిస్తున్నారు. 
 
 
అమరావతి ఉద్యమ నిధులు కోసం చంద్రబాబు, అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన నిర్వహ‌కులు  పాదయాత్ర చేసిన ఘటనను మరిచిపోయారని, రాజధాని అమరావతి అతి కొద్ది మంది కోసం అన్నట్టుగా ఉద్యమ కార్యాచరణ చేపట్టడం నిర్వాహకులకు మంచి పరిణామాలు కావని హితవు పలికారు.
 
 
సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని కోసం, రైతుల కోసం మాట్లాడేవారని, తిరుపతి సభకు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం లేదా?  లేక కేంద్ర బిజెపి ఆదేశాల మేరకు దూరంగా వున్నారా  ? తిరుపతిలో జరిగిన బహిరంగ సభ రాజధాని రైతులు కోసం, అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని సభ నిర్వహించినట్టు లేదని, ఒక వర్గం ఆధిపత్యం నిరూపించుకునే విధంగా బహిరంగ సభ జరిగిందని విమ‌ర్శిస్తున్నారు. 
 
 
సభ నిర్వాహకులు ఒంటెద్దు పోకడ కారణంగా, స్వార్ధ ప్రయోజనాలు కారణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు, అమరావతి ఉద్యమానికి చెడు జరిగే ప్రమాదం వుందని, అమరావతి ఉద్యమానికి 13 జిల్లాల భాగ‌స్వామ్యం ఉండేలా, రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయాల‌ని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.