రోజా ఎక్కిన విమానం తిరుపతిలో కాకుండా బెంగళూరులో ..? (వీడియో)
ఫ్లయిట్ ఎక్కాక... అది తిరిగి సరిగా ల్యాండ్ కాలేకపోతే, ఆ టెన్షన్ ప్రయాణికులకు మామూలుగా ఉండదు. ఇక పైలట్లు, విమాన సిబ్బంది... ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు.
ఈ మధ్యాహ్నం రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానానికి ల్యాండింగ్ సమస్య ఏర్పడింది. తిరుపతి ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ సాధ్యం కాక గంట సమయం ఇండిగో ఫ్లైట్ గాలిలోనే చక్కర్లు కొట్టింది. రాజమండ్రిలో విమానం ఎక్కిన మాజీ మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యే రోజాతోపాటు ప్రయాణికులు బాగా టెన్షన్ పడ్డారు. చివరికి ఆ విమానాన్ని దారి మళ్ళించి, బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు.
వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్యా అనే విషయంలో ఇండిగో సంస్థ సరిగా స్పష్టత ఇవ్వడం లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు చెప్పారు. ఇండిగో సిబ్బంది సమాధానంపై ప్రయాణికులంతా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికుల నుంచి అదనపు రుసుమును డిమాండ్ చేయడంతో ప్రయాణికులు ఇండిగో సిబ్బందిపై తీవ్ర నిరసన తెలిపారు. యాజమాన్యం తప్పిదానికి తామెందుకు డబ్బులు కట్టాలని ప్రయాణికులు మండిపడ్డారు. చివరికి బెంగుళూరు నుంచి గమ్యం స్థానాలకు చేరేందుకు ప్రయాణికుల సొంత ఏర్పాట్లు చేసుకున్నారు.