1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 6 డిశెంబరు 2021 (17:46 IST)

తిరుమ‌ల శ్రీవారికి ధ‌నుర్మాసంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

తిరుమ‌ల తిరుప‌తి వేంక‌టేశ్వ‌రునికి తిరుప్పావై ఆల‌పించే రోజులు దగ్గ‌రికి వ‌చ్చాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16న ప్రారంభం కానుంది. ఆరోజు మ‌ధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం అవుతుంది. 
 
డిసెంబరు 17 నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో, తిరుప్పావై నివేదిస్తారు. ధనుర్మాస ఘడియలు 2022, జనవరి 14న ముగియనున్నాయి. ఈ ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ఎలాగంటే, పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు  సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
 
 
12 మంది ఆళ్వార్లలో ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ, ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాస మూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.