జనసేనను వీడనున్న నాదెండ్ల... బీజేపీలో చేరనున్న రావెల
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అఖండ విజయాన్ని సొంతం చేసుకోగా, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. దీంతో జనసేన, టీడీపీ, కాంగ్రెస్ నేతలు తన రాజకీయ భవిష్యత్ కోసం పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటివారిలో జనసేనకు చెందిన నేతలే ఎక్కువగా ఉన్నారు.
ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇప్పటికే జనసేనకు గుడ్‌బై చెప్పారు. పైగా, ఆయన ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరి కాషాయ జెండాను కప్పుకోనున్నారు.
మరో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, ఎన్నికలకు ముందు జనసేనలో చేరి, గత ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈయన బీజేపీలో చేరితో ముచ్చటగా మూడోసారి పార్టీ మారినట్టే.
ఈ వార్తలను కొన్ని పరిణామాలు నిజం కూడా చేశాయి. గుంటూరు జిల్లాలో ఓటమికి కారణాలను అన్వేషిస్తూ, పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించగా, దానికి నాదెండ్ల మనోహర్ హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీని వీడుతున్నారనే ప్రచారం మొదలైంది.
ఈ నేపథ్యంలో జనసేన స్పందించింది. నాదెండ్ల మనోహర్ అమెరికా పర్యటనలో ఉన్నారనీ, ఈ కారణంగానే నాదెండ్ల సమీక్షా సమావేశానికి హాజరు కాలేదని స్పష్టంచేశారు. ఆయన పార్టీని వీడబోరని, కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది.