సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By

ఓడిపోయినా... 2.88 లక్షల మంది ఆశీర్వదించారు : జనసేన లక్ష్మీనారాయణ

తమ పార్టీతో పాటు తాను ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. లక్షలాది మంది ఓటర్లు వారి ఓటు హక్కుతో ఆశీర్వదించారని జనసేన పార్టీకి చెందిన వైజాగ్ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. ముగిసిన ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ, ఆయనకు 2,88,754 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఓటమికి గల కారణాలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ సమావేశానికి హాజరైన జేడీ మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని, భవిష్యత్తులో జనసేన పార్టీ పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవకపోయినా, తనను 2,88,754 మంది ఓటుతో ఆశీర్వదించారని గుర్తుచేశారు. పార్టీ పరంగా కూడా కొద్దిసమయంలోనే ఇంత పురోగతి సాధించడం మామూలు విషయం కాదన్నారు. 
 
ఇక, సమీక్ష గురించి చెబుతూ, ఈసారి ఎన్నికల్లో జనసేనలో లోపాలు ఎక్కడెక్కడ వచ్చాయి అనే విషయాన్ని పవన్ కల్యాణ్ అందరితో చర్చించారని తెలిపారు. జనసేన ప్రతిపాదించిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ యువతలోకి వెళ్లిందని, ధనప్రభావం లేని రాజకీయాలపై యువతలో ఆసక్తి మొదలైందని అన్నారు.
 
గతంలో తాను రైతులను కలిసేందుకు పాదయాత్ర చేశానని, ఇకముందు కూడా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్దకు కూడా వెళతామని సీబీఐ మాజీ జేడీ స్పష్టం చేశారు.