మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 18 జనవరి 2018 (10:43 IST)

"రియల్ శివగామి"... బిడ్డ ప్రాణానికి తన ప్రాణం అడ్డేసిన తల్లి

ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షక మహాశయుల నీరాజనాలు అందుకుంది. ఈ చిత్రంలో శివగామి పాత్రను నటి రమ్యకృష్ణ పోషించింది.

ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షక మహాశయుల నీరాజనాలు అందుకుంది. ఈ చిత్రంలో శివగామి పాత్రను నటి రమ్యకృష్ణ పోషించింది. ఇందులో అమరేంద్ర బాహుబలి కోసం శివగామి తన ప్రాణాలను అడ్డేస్తుంది. అంటే శివగామి నీట మునిగి ప్రాణాలు కోల్పోయినా, శిశువును మాత్రం ఒంటిచేత్తో పైకి ఎత్తిపట్టుకుని ప్రాణాలు కాపాడుతుంది. ఇదే తరహా విషాదకర ఘటన ఒకటి ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖలోని సబ్బవరం మండలం పైడివాడ గ్రామానికి చెందిన బండ శ్రీను (25), గౌరి (25) అనే దంపతులు ఉన్నారు. వీరికి కుశాలవర్ధన్‌ (4), హేమరఘురాం (2) అనే ఇద్దరు పిల్లలు. సంక్రాంతి పండగ కోసం మూడు రోజుల కిందట పెందుర్తి మండలం గండిగుండంలోని అత్తారింటికి ఈ దంపతులు తమ పిల్లలతో కలిసి వెళ్లారు. పండగ ముగించుకుని బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు.
 
మార్గమధ్యంలో సబ్బవరం శివారు చిన్నయ్యపాలెం టెర్రాకాన్‌ లేఅవుట్‌ వద్ద వస్తుండగా, వెనుకనే ఆర్టీసీ బస్సు వస్తోంది. ఆ బస్సుకు ఎదురుగా లారీ వచ్చింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీను, బైక్‌పై ముందు కూర్చున్న కుశాలవర్ధన్‌ తూలి రోడ్డుపక్కనే ఉన్న పొదల్లో పడిపోయాడు. వెనుక కూర్చొన్న గౌరీ, హేమరఘురాంలు రోడ్డుపై పడిపోయారు. 
 
అయితే, ఆ వెనుకనే ఆర్టీసీ బస్సు తన వైపు దూసుకురావడాన్ని హేమ గమనించి... ఒడిలోని బాబును రెండు చేతులతో పట్టుకుని క్షణాల్లో రోడ్డుపక్కనే ఉన్న తుప్పల్లోకి విసిరేసింది. ఆ వెంటనే రెప్పపాటులో బస్సు వెనుక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లడంతో గౌరి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు తెప్పించింది.