టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు!!
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా టీడీపీలో కొనసాగిన ఆయన శుక్రవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 42 యేళ్లు టీడీపీ కోసం పాటుపడ్డానని, తనను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశ్యంతో పని చేశారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారడం బాధగా ఉన్నా తప్పడం లేదన్నారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు వైకాపాలో చేరబోతున్నట్టు తెలిపారు.
కాకినాడ జిల్లాలో యనమల బ్రదర్స్ టీడీపీకి అత్యంత కీలక నేతలుగా చెలామణి అవుతున్న విషయం తెల్సిందే. కొంతకాలంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి, తమ్ముడు యనమల కృష్ణుడికి మధ్య విభేదాలు నెలకొనివున్నాయి. గత 2014, 2019లో తుని నుంచి పోటీ చేసిన యనమల కృష్ణుడు ఓడిపోయారు. ఈసారి తుని టికెట్‌ను టీడీపీ హైకమాండ్ యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన కృష్ణుడు ఇపుడు ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు.