ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (09:08 IST)

గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ఆస్తులు విలువ రూ.5,705 కోట్లు!!

pemmasani
లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు స్థానం నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన నామినేషన్ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ఆస్తుల వివరాలను పేర్కొన్నారు. అమెరికా, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీల్లో కలిపి మొత్తం రూ.5,705.47 కోట్ల మేరకు ఆస్తులు కలిగివున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 37 పేజీల అఫిడవిట్‌లో ఆయన తన కుటుంబ ఆస్తుల వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 
 
ఓ సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య వృత్తి ద్వారా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. ఆమెరికా, గుంటూరు, కృష్ణా జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్, ఢిల్లీల్లో ఆస్తులను సమకూర్చుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతపెద్ద మొత్తంలో స్థిర చరాస్తులను ఏ అభ్యర్థి చూపించకపోవడం గమనార్హం. ఒకవిధంగా దేశంలోని అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థుల్లో పెమ్మసాని ఒకరుగా ఉన్నారు.
 
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పెమ్మసాని కుటుంబం కొన్నేళ్ల పాటు నరసరావుపేటకు వలస వెళ్లి అక్కడ నివాసం ఉన్నది. అప్పట్లోనే పెమ్మసాని ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం ఎండీ చేయడానికి అమెరికా వెళ్లారు. సొంతంగా మెటీరియల్ తయారు చేసుకుని ఎండీని పూర్తి చేశారు. అప్పట్లో ఆయన రూపొందించిన మెటీరియల్ నేటికీ అక్కడి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అలా అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. యూఎస్‌లో వివిధ రూపాల్లో రూ.28.93 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. జేపీ.మోర్గాన్ వంటి బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి. పెమ్మసాని పేరు మీద రూ.519 కోట్లు, ఆయన సతీమణి కోనేరు శ్రీరత్న పేరుతో మరో రూ.519 కోట్లు అప్పులు ఉన్నాయి.
 
పెమ్మసాని కుటుంబానికి చరాస్తులు ఎక్కువగా ఉన్నాయి. పెమ్మసాని పేరు మీద రూ.2,316 కోట్లు, ఆయన సతీమణి శ్రీరత్న పేరుతో రూ.2,289 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. పిల్లల్లో ఒకరి పేరుతో రూ.496 కోట్లు, మరొకరి పేరు మీద రూ.496 కోట్ల చరాస్తులున్నాయి. స్థిరాస్తులు పెమ్మసాని పేరుతో రూ.69.33 కోట్లు, భార్య పేరుతో రూ.25 కోట్లు ఉన్నాయి. పెమ్మసానికి 181 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. కుటుంబం పేరుతో రూ.4.20 లక్షల విలువైన 5.5 కేజీల వెండి ఆభరణా లున్నాయి. సొంతంగా మెర్సిడెస్ బెంజ్-ఎస్ క్లాస్, సీ క్లాస్, టెస్లా మోడల్ ఎక్స్‌క్లాస్, రోల్స్ రాయిస్ ఘోస్ట్, టోయోటా ఫార్చునర్ కార్లు ఉన్నాయి. వీటి విలువ వచ్చి రూ.6.11 కోట్లు ఉంది.