టీడీపీలోకి మరో వైకాపా ఎమ్మెల్యే... నారా లోకేశ్‌ను కలిసిన ఆదిమూలం
ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ అధికార వైకాపా అసంతృప్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమైపోయారు. తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా పార్టీ మారేందుకు సమాయత్తమైపోయారు. ఇందులోభాగంగా, ఆయన మంగళవారం తన కుమారుడితో కలిసి హైదరబాద్ నగరంలో ప్రత్యక్షమై, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆయన పార్టీమారడం తథ్యమనే సంకేతాలు పంపించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వేల పేరుతో సిట్టింగ్ ప్రజాప్రతినిధులకు మొండిచేయి చూపడం లేదా మరో చోట పోటీ చేసేలా ఒప్పించడం వంటివి చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ విధానాన్ని అనేక మంది ప్రజాప్రతినిధులకు నచ్చడం లేదు. దాంతో అసంతృప్తికి గురైన ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి వారిలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా చేరిపోయారు.
ఆయనకు మళ్లీ టిక్కెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు. అయితే, తిరుపతి లోక్‌సభ నుంచి పోటీ చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనను కోనేటి ఆదిమూలం తీవ్రంగా వ్యతిరేకించారు. అదేసమయంలో చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంతలో తన కుమారుడితో కలిసి ఆయన హైదరాబాద్ నగరంలో ప్రత్యక్షమై నారా లోకేశ్‌ను కలవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.