హస్తినకు జగన్... మోడీతో భేటీ... ప్రత్యేక హోదాపై చర్చించేనా?
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లోని తన నివాసం నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీకానున్నారు.
అయితే, జగన్ మోహన్ రెడ్డి వెంట కేవలం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు మాత్రమే ఉన్నారు. అయితే, మరికొందరు నేతలు మాత్రం శనివారమే ఢిల్లీకి చేరుకుని జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కాగా, ఆదివారం ఉదయం 9 గంటలకు ఢిల్లీకి చేరుకునే జగన్.. ఉదయం 10.40 గంటలకు మోడీతో సమావేశమవుతారు. పిమ్మట ఏపీ భవన్‌కు వెళ్ళి అక్కడ ఏపీ భవన్ అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రానికి ఆయన విజయవాడకు చేరుకుంటారు.