సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2024 (14:36 IST)

మా నాన్నను గొడ్డలితో నరికారని జగన్‌కు ఎలా తెలుసు... మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు : వివేకా కుమార్తె్

sunitha
మా నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికారని మా అన్న, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసని వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ప్రశ్నిస్తున్నారు. మా అన్న మరోమారు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచకం పెట్రేగిపోతుందని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో మా అన్న పార్టీ వైకాపాకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటు వేయొద్దని కోరారు. ఇదే అంశంపై ఆమె శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరారు. 
 
'సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు చేశారనేది 4-5 రోజుల్లో నిర్ధరణకు రావొచ్చు. వివేకానంద రెడ్డి కేసులో ఐదేళ్లయినా ఇంకా ఎందుకు తెలియడం లేదు? 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. సొంతవాళ్లే మోసం చేయడంతో వివేకా ఓడిపోయారు. అయినా నిరాశ చెందకుండా.. మరింత యాక్టివ్‌ అయ్యారు. ఎంత ప్రయత్నించినా ఆయన్ను అణగదొక్కలేకపోతున్నామనే భయం ప్రత్యర్థుల్లో ఎక్కువైంది. అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు. 
 
హత్య తర్వాత మార్చి 15, 2019న మార్చురీ బయట అవినాష్‌ నా వద్దకు వచ్చారు. రాత్రి 11.30 గంటల వరకు పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారు.. మనం మాత్రం రియలైజ్‌ కాలేం. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది? సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదు? నాన్నను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసు? అది బయటకు రావాలి. మా నాన్న హత్య కేసులో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉంది. వాళ్లిద్దరినీ జగన్‌ రక్షిస్తున్నారు. అవినాష్‌ రెడ్డికి శిక్ష పడాలి.. పడుతుంది. వంచన, మోసానికి పాల్పడ్డారు. మా అన్న పార్టీ వైకాపాకు ఓటు వేయొద్దు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే. 
 
ఇచ్చిన మాట మీద నిలబడతా.. విశ్వసనీయత అంటూ జగన్ పదేపదే చెప్తున్నారు. కానీ ఈ చెల్లికి ఇచ్చిన మాటను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలి. సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించలేం.. అందుకే జగన్‌ను కలిసినప్పుడు నాకు ఆయనపై అనుమానం రాలేదు. ఒక్కో వాస్తవం బయటకు వస్తుంటే నమ్మాల్సి వచ్చింది. ఈ హత్య కేసులో 8 మంది పేర్లు బయటకు వచ్చాయి.. ఇంకా రాని పేర్లు చాలా ఉన్నాయి. జగన్‌ పాత్రపైనా విచారణ చేయాలి.. నిర్దోషి అయితే వదిలేయాలి. తప్పు చేసిన వారు మాత్రం తప్పించుకోకూడదు. 
 
శివశంకర్‌ రెడ్డి అరెస్టు తర్వాత కేసు మొత్తం మారిపోయి.. భయం మొదలైంది. అప్పటి నుంచే సీబీఐపై కేసులు పెట్టడం ప్రారంభించారు. సిబ్బందిపై కేసుల తర్వాత కడప నుంచి సీబీఐ అధికారులు వెళ్లిపోయారు. కేసు హైదరాబాద్‌కు బదిలీ అయ్యాకే విచారణ మళ్లీ ప్రారంభమైంది. అవినాష్‌ అరెస్టు కోసం సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లినపుడు అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. అరెస్టు చేయడానికి సీబీఐ వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా? అరెస్టు చేయాల్సిన వ్యక్తి కళ్లెదుటే ఉన్నా.. దర్యాప్తు సంస్థ అధికారులు రెండు రోజులు ఎదురుచూసి వెనక్కి వచ్చారు. 
 
నిందితులు ఒక్కసారి బెయిల్‌పై బయటకొస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేయరా? జగనన్న కేసుల వల్లే మా నాన్న హత్య కేసును సాగదీస్తున్నారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో నాకు తెలియదు. అనుమానితులుగానే నన్ను, నా భర్తను ప్రశ్నించారు. ప్రభుత్వం వెనుక ఉంది కాబట్టే మాపై కేసులు పెట్టారు. నాలాగే అందరినీ విచారించాలి. విచారణ త్వరగా పూర్తిచేసి దోషులను గుర్తించాలి. నేను ప్రజల్లోకి వెళ్తా.. అయితే ఎలా వెళ్లాలనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. నేను పోటీ చేయాలా? వద్దా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని సునీతారెడ్డి అన్నారు.