కరణం బలరాంకు ఇద్దరు భార్యలు... తప్పుడు అఫిడవిట్ : ఆమంచి కృష్ణమోహన్
ఎన్నికల అఫిడవిట్‌లో టీడీపీ నేత కరణం బలరాం తప్పుడు సమాచారం ఇచ్చారని వైకాపా చీరాల సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం మాట్లాడుతూ, కరణం బలరాంకు నలుగురు సంతానం అయితే ముగ్గురిగా పొందుపరిచారన్నారు. దీనిపై హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్టు చెప్పారు.
కాట్రగడ్డ ప్రసూనకు బలరాంకు అంబికా కృష్ణ అనే కూతురు ఉందన్నారు. బలరాం తన అఫిడవిట్‌లో అంబికాను తన సంతానంగా పొందుపరచలేదని తెలిపారు. అంబికాకు బలరాం తండ్రి హోదాలో అన్న ప్రసన్నం దగ్గర నుండి 8 ఏళ్ళు పుట్టిన రోజులు కూడా చేశారని పేర్కొన్నారు.
సెయింట్ థెరిసా హాస్పిటల్ ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్‌లో బలరాం తండ్రిగా ఉన్నారనీ, అన్ని సర్టిఫికెట్స్‌లో అంబికాకు బలరాం తండ్రి అని ఉందన్నారు. అంబికా తన కూతురు కాదు అని బలరాం అంటే కనుక ఏ పరిక్షకైనా అంబికా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఫోరెన్సిక్, డీఎన్ఏ వంటి సైoటిఫిక్ పరీక్షలకు కూడా అంబికా సిద్ధముగా ఉన్నట్టు చెప్పారు. తన తండ్రి ఎవరు అనేది ప్రపంచానికి చెప్పాలన్నదే అంబికా కోరిక అని తెలిపారు. అంబికాకు న్యాయం చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నా, పదవుల కోసం కాదు, అంబికా ఎవరనేది చంద్రబాబుకి బాగా తెలుసన్నారు.
బలరాం కుమార్తెగా గతంలో ఆమె రాసిన పుస్తకాన్ని మాజీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారని చెప్పారు. కన్న కూతురి పేరుని అఫిడవిట్‌లో పెట్టని కఠినమైన వ్యక్తి బలరాం అని, విలువల గురించి మాట్లాడే చంద్రబాబు, బలరాం ను పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.