మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (11:43 IST)

జగన్ అనే నేను... : వైకాపా సీఎల్పీ నేతగా జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన వైకాపా శాసనసభాపక్ష సమావేశం శనివారం విజయవాడ తాడేపల్లిలో ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇందులో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. జగన్ పేరును సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా, మాజీ మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు అయిన ధర్మాన ప్రసాదరావు, పార్థసారథితో మరో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ బలపరిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా ఏకవాక్య తీర్మానానికి ఆమోదం తెలిపారు. 
 
కాగా, శనివారం ఉదయం 11.32 గంటలకు వైకాపా శాసనసభాపక్షం సమావేశమైంది. ఈ సమావేశం ముగిశాక జగన్‌.. రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవడానికి హైదరాబాద్‌ బయలు దేరతారు. జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు. 
 
ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమై.. తన ప్రమాణ స్వీకారోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరుకావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత విజయవాడకు చేరుకుంటారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మంట్ కోరారు. ఇది ఖరారు అయితే, ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు.