గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆయన పాలనలో సెంటు భూమి కేవలం పది రూపాయలే...!!!

jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అధికార పార్టీ నేతలు కారు చౌకకే తమ వశం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఏ రీతిలో సాగుతోంది ఈ ఒక్క ఉదారణే చాలు. సీఎం జగన్ రెడ్డి పాలనలో సెంటు భూమి కేవలం పది రూపాయలకు మాత్రమే కట్టబెట్టారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఎంత నిరుపయోగ మైన భూమినైనా ఇంత కారు చౌకగా ఇచ్చే ధర్మాత్ములు ఉన్నారా? అంటే ఆది ఏపీ ప్రభుత్వమేనని చెప్పక తప్పదంటున్నారు. 
 
తమది కాకపోతే చాలు అన్నట్టుగా ప్రజలకు ఉపయోగపడాల్సిన రూ.కోట్ల విలువైన భూమిని పార్టీ ప్రయోజనాల కోసం సెంటు భూమిని రూ.10 చొప్పున సర్కారు కేటాయించేసింది. సొంత పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం చేతికి ఎముకలేకుండా వ్యవహరించింది. వైసీపీ ఆఫీస్ కోసం సెంటు రూ.10 చొప్పున ఏకంగా 72 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం ధారాదత్తం చేసింది. రూ.కోట్ల విలువైన భూమిని వందల రూపాయలకు అద్దె రూపంలో లీజుకు ఇచ్చింది. 
 
ఈ సంఘటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలం ఎన్ఆర్‌పీ ఆగ్రహారంలో ఉన్న 72 సెంట్లలో వైసీపీ జిల్లా కార్యాలయం ఏర్పాటు కోసం శనివారం భూమి పూజ చేశారు. పార్టీ నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే స్థలం గతంలో హౌసింగ్ కార్పొరేషన్ ఆధీనంలో ఉండేది. అయితే, గత కొన్నేళ్లుగా ఈ స్థలం ఖాళీగా ఉండడంతో దీనిపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. 
 
అంతే అధికారికంగా సదరు స్థలాన్ని లీజు రూపంలో స్వాధీనం చేసుకున్నారు. 72 సెంట్లకు ఏటా రూ.720 లీజు చెల్లించేలా ఒప్పుందం చేసుకున్నారు. లీజు వ్యవధిని 33 ఏళ్లుగా నిర్ణయించారు. మూడు నెలల క్రితమే లీజు వ్యవహారాన్ని పూర్తి చేశారు. విషయం తెలిసినా హౌసింగ్ కార్పొరేషన్ మౌనం వహించడం గమనార్హం.