సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

పార్టీ మారారుగా.. రూ.25 లక్షలు కప్పం కట్టండి.. దంపతులకు వైకాపా నేతల వేధింపులు

neelam prameela
అధికార వైకాపాలో ఉండలేక విపక్ష తెలుగుదేశం పార్టీలో చేరిన కౌన్సిలర్ల దంపతులకు వైకాపా నేతల నుంచి బెదిరింపులు మరింతగా ఎక్కువైపోయాయి. పైగా, పార్టీ మారినందుకు రూ.25 లక్షలు కప్పం కట్టాలంటూ వేధిస్తున్నారు. ఈ ఘటన కడప జిల్లా కమలాపురం పురపాలక సంఘంలో జరిగింది. ఈ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా నీలం ప్రమీల ఉన్నారు. ఈమె తన భర్త నీలం నరేంద్రతో కలిసి టీడీపీలో చేరారు. అంతే.. వైకాపా నేతలు ఒక్కసారిగా వారిని వేధించడం మొదలుపెట్టారు. నరేంద్రపై రెండు తప్పుడు అత్యాచారం కేసులు నమోదు చేయించారు. ఓ కేసులో మూడు రోజులు జైలుకెళ్లి వచ్చారు. మరో హత్య కేసులోనూ ఇరికించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైగా, కౌన్సిలరుగా గెలిపించడానికి రూ.25 లక్షలు ఖర్చయిందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని దౌర్జన్యానికి దిగుతున్నారు. చివరికి ఫోర్జరీ సంతకంతో కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం తీర్మానాన్ని ఆమోదించారు. కానీ, తాను రాజీనామా చేయలేదని అధికారులకు ప్రమీల మొరపెట్టుకున్నారు.
 
వైకాపాలో నాయకుల వేధింపులకు తట్టుకోలేకపోతున్నామని కమలాపురం 20వ వార్డు కౌన్సిలరు నీలం ప్రమీల, ఆమె భర్త నరేంద్ర తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి సమక్షంలో గత నెల 18న ఆ పార్టీలో చేరారు. వెంటనే నలుగురు వైకాపా నేతలు కౌన్సిలరు ఇంటికి వెళ్లి.. ఆమెను గెలిపించడానికి ఖర్చయిన రూ.25లక్షలు చెల్లించాలని, లేదంటే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. 
 
ఈలోపు.. మహిళా, శిశుసంక్షేమ సంఘం జిల్లా ఛైర్‌పర్సన్‌ పి.మేరీ.. తన ట్రాక్టరు డ్రైవరు పోలీసుల అదుపులో ఉండటంతో వారిని కలిశారు. ఈ సమయంలో ఎస్‌.ఐ. చిన్నపెద్దయ్య తెల్ల కాగితంపై సంతకం చేయాలని కోరగా ఎందుకని ఆమె ప్రశ్నించారు. జామీను కోసమంటూ అడిగి ఖాళీ కాగితంపై సంతకం చేయించుకున్నారు. తర్వాత మేరీపై నీలం నరేంద్ర అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదు చేసి, అరెస్టుచేశారు. దాంతో.. తాను చేయని ఫిర్యాదు ఆధారంగా నరేంద్రపై కేసు ఎలా పెడతారని ఎస్‌ఐని మేరీ ప్రశ్నించారు.
 
ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి, నరేంద్రపై తాను ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కమలాపురం కోర్టు జడ్జి ముందూ వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం జైల్లో ఉన్న నరేంద్ర విడుదలయ్యారు. ఇటీవల నియోజకవర్గంలో ఓ వైకాపా నేత హత్యకు గురయ్యారు. ఈ కేసులో నరేంద్రను అనుమానితునిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. 
 
ఈలోపు నీలం ప్రమీల రాజీనామా చేసినట్లు ఫోర్జరీ సంతకంతో పత్రాన్ని రాసి పురపాలక సంఘం ఎజెండాలో చేర్చారు. మంగళవారం జరిగిన సమావేశంలో దీన్ని ఆమోదించారని ప్రమీల ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అధికారులపై న్యాయపోరాటం చేస్తానన్నారు. తాను ఆరోగ్యంతో ఉన్నా.. అనారోగ్యం వల్ల రాజీనామా చేశానని చిత్రీకరించడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారం కమలాపురంలో సంచలనంగా మారింది.