గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (17:47 IST)

జగన్‌కు షాక్.. టీడీపీలోకి మరో వైకాపా ఎమ్మెల్యే?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ముస్తఫా సైకిలెక్కేందుకు

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ముస్తఫా సైకిలెక్కేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
శనివారం గుంటూరులో ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సం జరిగింది. ఇందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులు పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబును ముస్తఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. కొద్దిసేపు చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకువచ్చారు. 
 
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దలి గిరిధరరావుపై ముస్తఫా విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదేసమయంలో ముస్తఫాను కొంతకాలంగా టీడీపీలో చేర్చేందుకు నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. 
 
ఈ మంతనాలు ఫలించడంతో రాయపాటి స్వయంగా ముస్తఫాను తన కారులో ఎక్కించుకుని చంద్రబాబు వద్దకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. హెలిఫ్యాడ్ వద్ద సీఎం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో చంద్రబాబు, ముస్తఫా, రాయపాటిల మధ్య పదినిమిషాల పాటు చర్చలు జరిగాయి. దీంతో ముస్తఫా టీడీపీలో చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.