గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (09:07 IST)

పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరింది.. పోలీసు వాహనాలకు వైకాపా రంగులు!

పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరిందంటారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా శ్రేణులకు నిజంగానే పిచ్చి ముదిరిపోయింది. అందుకే.. ఆ పార్టీ రంగులు ఇపుడు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ భవాలను, ప్రభుత్వం నిర్మించే పక్కా గృహాలు, కరెంట్ స్తంభాలు ఇలా పలు చోట్ల వైకాపా రంగులు వెలిశాయి. ఇపుడు ఏకంగా పోలీసు వాహనాలకు కూడా ఈ రంగులు కొట్టేస్తున్నారు. ఇపుడు దిశ పేరుతో ఏర్పాటైన పోలీస్ స్టేషన్లకు సమకూర్చిన వాహనాలకు వైకాపాకు చెందిన మూడు రంగులు వేయించి, వాటిని మహిళా పోలీసులకు అందజేశారు. 
 
నిజానికి గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి వైసీపీ రంగులేయించింది. అది వివాదాస్పదమై కోర్టులు తప్పు పట్టింది. ఏదైతేనేం చివరికి ఆయా రంగులను మార్చేశారు. అప్పట్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 'దిశ' స్టేషన్‌లకు కూడా వైసీపీ రంగులు వేయగా కోర్టు ఆదేశాలతో వాటిని కూడా మార్చారు. 
 
అలాగే మహిళల రక్షణ కోసం అంటూ ప్రారంభించిన దిశ యాప్‌కు కూడా వైసీపీ రంగులే వేశారు. రంగుల విషయంలో ఇంత వివాదం జరిగినప్పటికీ తాజాగా పోలీస్‌ వాహనాలకూ వైసీపీ రంగులేశారు. సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి సోమవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ పుట్టిన రోజు కానుక అన్నట్లుగా గుంటూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 
 
దిశ వాహనాలకేకాకుండా, గతంలో కేంద్ర ప్రభుత్వం 'శక్తి' పేరుతో ప్రతి స్టేషన్‌కూ మహిళా ఎస్‌ఐలకు కేటాయించిన బైక్‌లకూ వైసీపీ స్టిక్కర్లు అంటించి దిశ పేరుతో ప్రారంభించారు. సోమవారం గుంటూరులోని పోలీస్‌ కార్యాలయంలో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఈ వాహనాలను జెండా ఊపి అట్టహాసంగా ప్రారంభించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఆ స్కూటీలు పాతవి కావడంతో కొన్ని వాహనాలు మొరాయించాయి.