సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (08:35 IST)

అమరావతి స్వప్నం వాస్తవ రూపం ... జై అమరావతి : వైకాపా ఎంపీ

నవ్యాంధ్ర రాజధాని అమరావతి స్వప్నం వాస్తవ రూపం దాల్చుతుందని వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. పైగా, ఏపీ శాఖ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 
 
ఈ నెల 17వ తేదీతో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి ఒక యేడాది పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ట్విట్టర్ లో 'జై అమరావతి' అంటూ స్పందించారు. 
 
అమరావతి ఉద్యమం మొదటి సంవత్సరాన్ని పూర్తిచేసుకునేందుకు రెండ్రోజుల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు అమరావతి మాత్రమే ఏపీ రాజధాని అని చాటుతున్నాయని పేర్కొన్నారు. 
 
అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినిధిగా ఈ మాట చెబుతున్నానంటూ సోము వీర్రాజు ప్రధాని పేరు ప్రస్తావించడం చూస్తుంటే అమరావతి రాజధాని అవుతుందన్న నిశ్చితాభిప్రాయం కలుగుతోందని తెలిపారు.
 
అమరావతి ఉద్యమం 365వ రోజున ఇతర పార్టీలతో కలిసి బీజేపీ కూడా ఉద్యమంలో పాలుపంచుకుంటుందని భావించవచ్చని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. త్వరలోనే ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి స్వప్నం వాస్తవరూపం దాల్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.