మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 14 సెప్టెంబరు 2023 (22:06 IST)

ADR రిపోర్ట్: పార్లమెంటు సభ్యుల్లో తెలుగు ఎంపీలే సూపర్ రిచ్, నేర చరిత్రలోనూ మనవారే టాప్

Ayodhya Ramireddy
ప్రస్తుత పార్లమెంట్‌లో 40 శాతం ఎంపీలపై నేరాభియోగాలు, 25 శాతం మంది మీద తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యు) నివేదిక వెల్లడించింది. దేశంలో ఎన్నికల రాజకీయాలు, అభ్యర్ధుల నేపథ్యం గురించి ఏడీఆర్ తరచూ నివేదికలు విడుదల చేస్తుంటుంది. తాజాగా విడుదల చేసిన రిపోర్టు 2023 నాటికి పార్లమెంటులో ఉన్న ఎంపీలు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా రూపొందింది.
 
నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీలు
రాజ్యసభ, లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం 763 మంది పార్లమెంట్ సభ్యుల్లో 360 మంది అంటే 40 శాతం మంది తమపై నేరాభియోగాలు ఉన్నాయని ప్రకటించారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ రిపోర్ట్ ప్రకటించింది. అందులో 194 మంది మీద అంటే 25 శాతం ఎంపీల మీద హత్య, హత్యా ప్రయత్నం, అపహరణ, మహిళలపై దాడుల వంటి తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లోని 776 మంది ఎంపీల్లో తమ వివరాలు స్వయంగా ప్రకటించిన 763 మంది అఫిడవిట్లను పరిశీలించి తయారు చేసిన నివేదిక ఇది.
 
నివేదికలో పేర్కొన్న ప్రకారం నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీల విషయంలో లక్షద్వీప్ ముందుంది. దీనికి కారణం అక్కడ ఒక్కరే ఉండటం, ఆయన మీద కేసులు ఉండటంతో అది వంద శాతంగా గుర్తించారు. మిగతా రాష్ట్రాల విషయానికొస్తే అక్షరాస్యతలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న కేరళ నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీల విషయంలోనూ అగ్రభాగంలో ఉంది. కేరళలోని 29 మంది ఎంపీల్లో 23 మంది కేసులు ఎదుర్కొంటున్నారు. బిహార్‌లోని 56 మంది ఎంపీల్లో 41 మంది ఎంపీలు తమపై నేరాభియోగాలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నట్లు రిపోర్ట్ తెలిపింది. బిహార్ తర్వాతి స్థానంలో ఉంది తెలుగు రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలోని 24 మంది ఎంపీల్లో 9 మంది మీద నేరారోపణల్ని ఎదుర్కొంటున్నారు.
 
పార్టీల వారీగా చూస్తే ఎవరెక్కడ?
నేరాభియోగాల విషయంలో పార్టీల విషయానికొస్తే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీల పరంగానే కాకుండా, వారిలో నేరస్థుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలోనూ అగ్రభాగాన ఉంది. లోక్‌సభ, రాజ్యసభలో బీజేపీకున్న 385 మంది ఎంపీల్లో 139 మంది పైన కేసులున్నాయి. ఈ జాబితాలో వైఎస్సార్‌సీపీ ఏడో స్థానంలో ఉంది. వైసీపీకున్న 31 మంది ఎంపీల్లో 13 మంది నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఎం, ఆప్ ఆ తర్వాత వైసీపీ ఉంది. మొత్తం ఎంపీల్లో 11 మంది ఎంపీలు హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారని నివేదిక వెల్లడించింది.
 
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో తెలుగువాళ్లెవరు?
ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయన మీద రెండు కేసులు ఉన్నాయి. ఈ జాబితాలో 13 హత్య కేసులతో అందరి కంటే ముందున్నారు బీఎస్పీ ఎంపీ అతుల్ కుమార్ సింగ్.‌ ఇక హత్యాయత్నానికి సంబంధించిన కేసుల విషయానికొస్తే టీఆర్ఎస్ ఎంపీ సోయం బాపూరావుపై 52 కేసులున్నాయి. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మీద నాలుగు అటెంప్ట్‌ టు మర్డర్ కేసుల్లో విచారణ జరుగుతోంది. మహిళలపై దాడులు చేసిన కేసుల విషయంలో వైసీపీ ఎంపీలు మార్గాని భరత్‌ పై రెండు, బెల్లాన చంద్రశేఖర్‌పై నాలుగు, గోరంట్ల మాధవ్‌పై రెండు కేసులు ఉన్నాయి. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై 42, టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుపై 5 కేసులు ఉన్నాయి.
 
తెలుగు రాష్ట్రాల ఎంపీలు బాగా సంపన్నులు
తెలుగు రాష్ట్రాల ఎంపీలు బాగా డబ్బున్నవాళ్లని చెబుతోంది ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక. లోక్‌సభ, రాజ్యసభ మొత్తం ఎంపీల సగటు ఆస్తుల విలువ 38.33 కోట్ల రూపాయలు. రాష్ట్రాల వారీగా తీసుకుంటే... కొందరు తెలంగాణ ఎంపీలు కోట్లకు పడగలెత్తినట్లు ఏడీఆర్ రిపోర్ట్ స్పష్టం చేసింది. తెలంగాణలో సగటున ఎంపీల ఆస్తుల విలువ 262.26 కోట్ల రూపాయలు. ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీ ఎంపీల సగటు ఆస్తుల విలువ 150.76 కోట్ల రూపాయలు. ఈ జాబితాలో ఆఖరి స్థానంలో ఉన్న లక్ష ద్వీప్ ఎంపీ ఆస్తుల విలువ 9.38 లక్షల రూపాయలు.
 
టీఆర్ఎస్, వైసీపీలో సంపన్నులైన ఎంపీలు
పార్టీల వారీగా తీసుకున్నా... తెలుగు రాష్ట్రాలకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్, టీఆర్ఎస్‌ పార్టీలు జాతీయ పార్టీల కంటే ముందున్నాయి. ఈ నివేదిక రూపొందించే నాటికి టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగానే ఉంది. ఈ పార్టీ ప్రజాప్రతినిధుల సగటు ఆస్తుల విలువ 383.51 కోట్ల రూపాయలు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ఆస్తుల విలువ 153.76 కోట్ల రూపాయలు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల సగటు ఆస్తుల విలువ 119.84 కోట్ల రూపాయలు. ఈ అంశంలో మూడు ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు చాలా దూరంలో ఉన్నాయి.
 
బిలియనీర్లలోనూ తెలుగు ఎంపీలదే ఆగ్రస్థానం
మొత్తం 763 మంది ఎంపీల్లో 53 మంది బిలియనీర్లు. అంటే వారి ఆస్తుల విలువ వంద కోట్ల రూపాయలకు పైమాటే. వ్యక్తిగత ఆస్తులు, పార్టీల వారీగా సగటు ఆస్తుల విలువలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు బిలియనీర్ ఎంపీల విషయంలోనూ అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. టీఆర్ఎస్‌కున్న 24 మంది ఎంపీల్లో ఏడుగురు బిలియనీర్లు. ఆంధ్రప్రదేశ్‌లోని 36 మంది పార్లమెంట్ సభ్యులలో 9 మంది దగ్గర వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. పార్టీలవారీగా చూస్తే టీఆర్ఎస్‌కున్న 16 మంది ఎంపీల్లో ఏడుగురు, వైఎస్సార్‌సీపీకున్న 31 మందిలో ఏడుగురు ఎంపీలు బిలియనీర్లు.
 
తెలుగు రాష్ట్రాల ఎంపీల ఆస్తులు విలువ ఎంతంటే.?
ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభలో ఉన్న 763 మంది ప్రజా ప్రతినిధుల మొత్తం ఆస్తుల విలువ 29,261 కోట్ల రూపాయలు. ఇందులో 16 మంది టీఆర్ఎస్ ఎంపీల ఆస్తి విలువ 6,136 కోట్ల రూపాయలు. వైఎస్సార్ సీపీ 31 మంది పార్లమెంట్ సభ్యుల ఆస్తుల విలువ 4,766 కోట్ల రూపాయలుగా నివేదిక విశ్లేషించింది. బీజేపీలో ఉన్న 385 మంది ఎంపీల ఆస్తుల విలువ 7,051 కోట్ల రూపాయలు. 81 మంది కాంగ్రెస్ ఎంపీల ఆస్తులు 3,169 కోట్ల రూపాయలు. పార్లమెంట్‌లో ఉన్న మొత్తం ఎంపీల ఆస్తుల విలువలో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల ఎంపీల ఆస్తుల విలువ...10,902 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి చూస్తే.. ఏపీ, తెలంగాణ ఎంపీలు ఎంత ధనవంతులో అర్థం చేసుకోవచ్చు.
 
బిలీయనీర్ ఎంపీల నిలయంగా తెలుగు రాష్ట్రాలు
రాష్ట్రాల వారీగా వ్యక్తిగతంగా బిలియనీర్లైన ఎంపీల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ 9మందితో అగ్రస్థానంలో ఉంటే... ఏడుగురితో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పార్టీల వారీగా చూస్తే 14 మందితో బీజేపీ టాప్ ప్లేస్‌లో ఉంది. టీఆర్ఎస్, వైసీపీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పార్లమెంట్‌లో అత్యధిక ఆస్తులున్న ఎంపీ టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ బండి పార్ధసారథి రెడ్డి. ఆయన ఆస్తుల విలువ 5,300 కోట్ల రూపాయలు. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఎంపీల కంటే, కొన్ని పార్టీల మొత్తం ఎంపీల ఆస్తుల కంటే చాలా ఎక్కువ. ఆయన తర్వాతి స్థానంలో వైసీపీ నుంచి రాజ్యసభకే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. ఆయన ఆస్తులు 2,577 కోట్ల రూపాయలు. మూడో స్థానంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఉన్నారు. ఆమె ఆస్తులు 1001 కోట్ల రూపాయలు.
 
ఎంపీల్లో ఆస్తుల పరంగా మొదటి మూడుస్థానాల్లో ఉన్న వారంతా రాజ్యసభలోనే ఉన్నారు. మధ్య ప్రదేశ్‌ నుంచి చింద్వారా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తన్న ఎంపీ నకుల్ నాధ్ 660 కోట్ల రూపాయలతో నాలుగో స్థానంలో ఉన్నారు. సంపన్నులైన టాప్ టెన్ ఎంపీల్లో 9 మంది రాజ్యసభకు చెందినవారే. నకుల్‌నాధ్ ఒక్కరే లోక్‌సభ ఎంపీ. ఈ జాబితాలో పదో స్థానంలో కూడా వైసీపీ ఎంపీనే ఉన్నారు. 396 కోట్ల రూపాయలతో పరిమళ్ నత్వానీ పదో స్థానంలో నిలిచారు.
 
పేద ఎంపీలలోనూ మొదటి స్థానంలో వైసీపీ ఎంపీ
ప్రజల్లో ఉన్నట్లే పార్లమెంట్ సభ్యుల్లోనూ సంపద విషయంలో అసమానతలు ఉన్నట్లు ఏడీఆర్- ఎలక్షన్ వాచ్ నివేదిక స్పష్టం చేస్తోంది. పార్లమెంట్‌లో 13 మంది ఎంపీలు తమకున్న ఆస్తులు 10 లక్షల రూపాయల లోపేనని ప్రకటించారు. కోటి రూపాయల నుంచి పది కోట్ల రూపాయల మధ్య సంపద ఉన్న వారు 400 మంది ఉన్నారు. 5వందల కోట్ల రూపాయల నుంచి వెయ్యి కోట్ల రూపాయల మధ్య సంపద ఉన్న వారు ముగ్గురుంటే.. వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉన్న వారు ముగ్గురే ఉన్నారు. పది లక్షల రూపాయల కంటే తక్కువ ఆస్తులున్న ఎంపీల విషయంలోనూ వైసీపీ అగ్రస్థానంలో ఉంది. పార్లమెంట్‌లో తక్కువ ఆస్తులున్న ఎంపీల జాబితాలో ఆ పార్టీ ఎంపీ గొడ్డేటి మాధవి మొదటి స్థానంలో ఉన్నారు. అరకు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, తన ఆస్తులు లక్ష 41వేల రూపాయలుగా ప్రకటించారు. పది లక్షల రూపాయల లోపు ఆస్తులున్నట్లు ప్రకటించిన పది మందిలో ఏడుగురు లోక్‌సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యులున్నారు. ఇందులో నలుగురు బీజేపీ, ఇద్దరు బీజేడీ, ఇద్దరు ఆప్ సభ్యులున్నారు.
 
ఆస్తులే కాదు ఎక్కువ అప్పులు కూడా ....
ఎక్కువ అప్పులున్న ఎంపీల జాబితాలోనూ వైసీపీ ఎంపీ ఒకరు అగ్రస్థానంలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ తనకు 209 కోట్ల రూపాయల అప్పులున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారు మరో వైసీపీ ఎంపీ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి. ఆయనకున్న అప్పులు 154 కోట్ల రూపాయలు. అత్యధిక అప్పులున్న ఎంపీల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఆయన తనకు 325 కోట్ల రూపాయల ఆస్తులు, 101 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు తెలిపారు. ఇక ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు మరో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన 96 కోట్ల రూపాయల అప్పులున్నట్లు ఏడీఆర్ ఎలక్షన్ వాచ్ రిపోర్ట్ ప్రకటించింది. అప్పుల విషయంలో ఏపీ నుంచి నలుగురు ఎంపీలు ఉంటే వారిలో ముగ్గురు రాజ్యసభ, ఒకరు లోక్‌సభ సభ్యులు. నలుగురు వైసీపీ ఎంపీలే.
 
పదో తరగతి పాస్ కాని ఎంపీలు
విద్య విషయానికొస్తే పార్లమెంట్‌ సభ్యుల్లో 21 మంది పదో తరగతి కూడా పాసవ్వలేదు. పది పాసైన వాళ్లు 51 మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 526 మంది ఉన్నారు. డాక్టరేట్ చేసిన వారు 54 మంది ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 36 మంది ఎంపీలలో ఆరుగురు ఐదు నుంచి ఇంటర్ మధ్య చదువుకున్న వారు ఆరుగురు. 16 మంది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 14 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కంటే ఎక్కువగా చదువుకున్నారు. తెలంగాణలోనూ ఐదు నుంచి ఇంటర్ మధ్య చదువుకున్న వారు ఆరుగురే ఉన్నారు. 11 మంది గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఏడుగురు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువ చదువుకున్నారు. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుకున్న ఎంపీలు జేడీయూలో 48 శాతం మంది ఉన్నారు. ఇందులో తక్కువ శాతం వైసీపీలో 13 శాతంగా ఉన్నారు. ఉన్నత విద్య అభ్యసించిన ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్‌లో 61 శాతం ఉన్నారు.
 
పార్టీలకు వస్తున్న నిధుల మాటేమిటి
పార్టీలకు వస్తున్న నిధుల విషయాన్ని ఏడీఆర్ రిపోర్ట్‌ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందులో పార్టీలకు మూడు మార్గాల్లో నిధులు వస్తున్నాయి. అందులో ఒకటి పార్టీలకు వస్తున్న విరాళాలు, రెండోది పార్టీలు వివిధ మార్గాల్లో సంపాదించుకున్న ఆదాయం, మూడోది గుర్తు తెలియని సంస్థలు, వ్యక్తులు ఇచ్చిన నిధులు. వీటి గురించిన వివరాలను పార్టీలు తమ వార్షిక ఆడిట్, ఆదాయ నివేదికల్లో పొందుపరిచి ఎన్నికల సంఘానికి సమర్పించాయి. పార్టీలకు వస్తున్న విరాళాలు, పార్టీలు ఆర్జించే ఆదాయం పారదర్శకంగానే కనిపిస్తోంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలు ఇస్తున్న వాటికి లెక్కలు లేవు. ఇవి ఎలక్టోరల్ బాండ్స్, కూపన్ల అమ్మకాలు, రిలీఫ్ ఫండ్, గుర్తు తెలియని ఆదాయం, స్వచ్చంధంగా ఇస్తున్న విరాళం, సమావేశాలు, సదస్సుల ద్వారా సేకరించిన నిధులు అని భావించవచ్చని నివేదిక చెబుతోంది.
 
‘అన్ నోన్ సోర్స్’ అంటే ఏమిటి?
2022 ఆగస్టు 26న విడుదల చేసిన ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదికలో తమ వార్షిక ఆడిట్ నివేదిక, ఆదాయాల జాబితాలో పొందుపరిచిన దాని ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 27 ప్రాంతీయ పార్టీల ఆదాయం 530.703 కోట్లుగా పేర్కొన్నాయి. అందులో 263.928 అంటే 49.73 శాతం ఈ గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చింది. ఈ నివేదికను రూపొందించేందుకు ఏడీఆర్ 54 ప్రాంతీయ పార్టీలను గుర్తించింది. అయితే వాటిలో 28 పార్టీలు మాత్రమే తమ వార్షిక ఆడిట్ నివేదిక, ఆదాయ వివరాలను ఎన్నికల సంఘానికి అందించాయి. 14 పార్టీలు రెంటింటిలో ఒక్క నివేదిక మాత్రమే ఇచ్చాయి.12 పార్టీలు అసలు నివేదికే ఇవ్వలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 27 ప్రాంతీయ పార్టీల ఆదాయం ( అవి సమర్పించిన నివేదికల ప్రకారం) 1165.576 కోట్ల రూపాయలు. దాతలు ఇచ్చిన విరాళాలు ( దాతల వివరాలు ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికల్లో పొందుపరిచారు) 145.42 కోట్లు.
 
గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల ద్వారా వచ్చినవి 887.551 కోట్ల రూపాయలు. అంటే పార్టీలకు వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం అంటే 76.147 శాతం గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల ద్వారా వచ్చినవేనని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల్లో టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ తమకు వస్తున్న విరాళాలు, ఆదాయానికి సంబంధించిన రెండు నివేదికల్ని ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ముస్లిం లీగ్ వార్షిక ఆడిట్ రిపోర్ట్ సమర్పించలేదని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇందులో వైసీపీకి విరాళాల ద్వారా 20.01 కోట్లు వచ్చాయి. పార్టీకున్న ఆదాయ మార్గాల ద్వారా 13.6972 కోట్ల రూపాయలు, గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలు( అన్ నోన్ సోర్స్) ద్వారా వచ్చిన నిధులు 60.0168 కోట్ల రూపాయలు. మొత్తంగా వైసీపీకి 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం 93.724 కోట్ల రూపాయలు.
 
ఈ జాబితాలో డీఎంకే 318.745 కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో ఉంది. డీఎంకే తర్వాత బీజేడీ ఆ తర్వాతి స్థానంలో టీఆర్ఎస్ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితికి విరాళాల ద్వారా 40.90 కోట్లు, పార్టీ ఆదాయ మార్గాల్లో 24.175 కోట్లు, గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల ద్వారా 153.037 కోట్ల రూపాయలు వచ్చాయి. మొత్తం ఆదాయం 218.112 కోట్లు.
 
ఇక టీడీపీ విషయానికొస్తే... విరాళాల ద్వారా 0.629 కోట్లు, ఇతర మార్గాల ద్వారా 1.7505 కోట్లు, గుర్తు తెలియని మార్గాల ద్వారా 3.6485 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. టీఆర్ఎస్ మొత్తం ఆదాయంలో గుర్తు తెలియని మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం 70.16 శాతం, వైసీపీ విషయంలో అది 64.04 శాతంగా, టీడీపీ విషయంలో 60.53 శాతంగా ఉందని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది.
 
ఏడీఆర్ ఏం చేస్తుంది, ఎలా ఏర్పడింది
రాజకీయాల్లో పెరుగుతున్న నేరచరితులు, ధన ప్రవాహాన్ని గమనించిన ఐఐటీ అహ్మాదాబాద్‌లోని ఓ ప్రొఫెసర్ల బృందం దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఆస్తుల వివరాలు, అలాగే తమపై ఉన్న నేరాభియోగాల గురించి ప్రకటించాలని అందులో కోరింది. దీనిపైన 2022, 2023లో సర్వోన్నత న్యాయస్థానం తీర్పుఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసులు, తమ ఆస్తులు, విద్యార్హతలతో కూడిన అఫిడవిట్ ఎన్నికల సంఘానికి సమర్పించాలని అందులో ఆదేశించింది. 2003 మార్చ్‌లో ఈ ప్రొఫెసర్ల బృందం..అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థగా ఏర్పడింది. ఈ బృందం తరచూ నివేదికలను విడుదల చేస్తుంది.