ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 14 సెప్టెంబరు 2023 (12:33 IST)

జాహ్నవి కందుల: అమెరికాలో పోలీస్ కార్ ఢీకొని తెలుగు అమ్మాయి చనిపోతే అధికారి హేళన.. భారతీయుల ప్రాణాలకు విలువ లేదా?

image
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలోని సియాటెల్‌లో పోలీసు పెట్రోలింగ్ కారు కింద పడి ఒక తెలుగు మహిళ చనిపోయారు. ఆ దారుణ ప్రమాదంపై పోలీస్ అధికారి ఒకరు చులకనగా మాట్లాడిన బాడీ కేమ్ ఫుటేజీ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడి దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. జాహ్నవి కందుల అనే 23 ఏళ్ల మహిళ తాను చదివే యూనివర్సిటీకి సమీపంలోనే ఈ ఏడాది జనవరి 23న కారు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ జాహ్నవి మరణంపై తేలిగ్గా మాట్లాడినట్లు ఆడియో రికార్డులలో ఉంది.
 
జాహ్నవి మరణాన్ని ఉద్దేశిస్తూ ఆయన.. ‘పెద్ద వేల్యూ లేదు.. చెక్(పరిహారం) ఇస్తే సరిపోతుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాడీ కెమేరాలో రికార్డయ్యాయి. నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన జాహ్నవి కందుల రోడ్డు దాటుతున్న సమయంలో పోలీసు కారు ఢీకొంది. ‘సియాటెల్ టైమ్స్’ ప్రకారం, పోలీసు కారు ఆ సమయంలో గంటకు 119 కి.మీల వేగంతో వెళ్తోంది. కారు ఢీకొట్టిన తర్వాత 100 అడుగులకు పైగా దూరం ఆమెను లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
 
ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసు అధికారి ఆడెరర్‌ తన సహోద్యోగికి ఫోన్ చేసి మాట్లాడిన కాల్ తన బాడీ కెమెరాలో రికార్డయింది. ఆ రికార్డ్ ప్రకారం... ‘‘ఆమె చనిపోయింది’ అంటూ నవ్వారు. ‘నో, సాధారణ వ్యక్తే. చెక్ రాస్తే(పరిహారమిస్తే) సరిపోతుంది’’ అంటూ మరోసారి నవ్వారు. ‘’11 వేల డాలర్లు. ఆమెకు 26 ఏళ్లు ఉంటాయనుకుంటా. పెద్దగా వేల్యూ లేదు’’ అని అన్నారు. ఆడెరర్ సియాటెల్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన యూనియన్‌కు లీడర్ కూడా. గిల్డ్స్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌తో ఆయన ఫోన్‌లో సంభాషించినప్పుడు అది బాడీ కేమ్‌లో రికార్డైంది. అయితే, ఆ రికార్డ్‌లో ఆడెరర్ మాటలు మాత్రమే ఉన్నాయి. సోలన్ ఏం మాట్లాడారో రికార్డ్ కాలేదు.
 
పోలీసులు ఏం మాట్లాడుకుంటుంటారో వినే ఒక ప్రక్రియలో భాగంగా ఈ ఉద్యోగి సంభాషణ రికార్డ్ తాము విన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు గుర్తించామని సియాటెల్‌ పోలీసు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఆడెరర్ తన వ్యాఖ్యలపై విచారం చేశారని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. పోలీసుల దుష్ప్రవర్తనపై విచారణ జరిపే ‘ఆఫీస్ ఆఫ్ పోలీస్ అకౌంటబులిటీ’కి ఈ విషయం అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఆడెరర్ ఏ ఉద్దేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశారు, నిబంధనలు ఉల్లంఘించారా? అనేది ఈ ఏజెన్సీ విచారణ చేస్తుందని పోలీసులు చెప్పారు.
 
కాగా కేటీటీహెచ్-ఏఎం రేడియో హోస్ట్ జాసన్ రాంజ్ మాట్లాడుతూ... తాము ఆడెరర్ లిఖిత పూర్వక సమాధానం కాపీ సంపాదించామని చెప్పారు. మహిళ మరణంలో బాధ్యుల ప్రమేయం తగ్గించి చూపేందుకు నగరంలోని న్యాయవాదులు ఎలాంటి ప్రయత్నం చేస్తారో అనుకరించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ సమాధానంలో చెప్పారన్నారు. న్యాయపోరాటంలో ఇలాంటి ఘటనలు ఎలా హాస్యాస్పదంగా మారిపోతున్నాయో చెప్పే క్రమంలో తాను నవ్వినట్లు ఆడెరర్ ఆ లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారని కేటీటీహెచ్ రేడియో తెలిపింది.
 
కాగా బాడీ కెమేరాలో రికార్డైన విషయం షాక్ కలిగించిందని మరో పోలీసు ఏజెన్సీ సియాటెల్‌ కమ్యూనిటీ పోలీస్ కమిషన్ తెలిపింది. ఇది తెలిసి తాను షాకయ్యాయని, చాలా బాధపడ్డానని ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్ విక్టోరియా బీచ్ చెప్పారు. ఒకరు చనిపోతే, మరొకరు నవ్వడం తనని కలచివేసిందన్నారు. ఈ యాక్సిడెంట్‌ కేసుకు సంబంధించిన కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ ఆఫీస్ నేర సమీక్షను చేపట్టింది.