శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బీబీసీ
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (18:04 IST)

Jeff Bezos: అమెజాన్ సీఈఓగా జెఫ్ బెజోస్ స్థానంలో ఆండీ జస్సీ

జెఫ్ బెజోస్ సుమారు 30 ఏళ్ల క్రితం తన గ్యారేజీ నుంచి ప్రారంభించిన అమెజాన్ సంస్థ సీఈఓ పదవి నుంచి తప్పుకొంటున్నారు. ఆయన ఇక ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ నిర్ణయంతో తమ మిగతా వెంచర్స్‌పై దృష్టి పెట్టడానికి తనకు సమయం, శక్తి లభిస్తాయని ఆయన చెప్పారు.
 
జెఫ్ బెజోస్ స్థానంలో, ఇప్పుడు ఆండీ జస్సీ అమెజాన్ సీఈఓ కానున్నారు. ఆయన ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్‌‌కు నేతృత్వం వహిస్తున్నారు. 2021 ద్వితీయార్థంలో ఈ మార్పులు చోటుచేసుకుంటాయని కంపెనీ చెప్పింది.
 
"అమెజాన్ సీఈఓగా ఉండడం అనేది చాలా కీలక బాధ్యత. అది సమయం తినేస్తోంది. అలాంటి బాధ్యత ఉన్నప్పుడు మనం వేరేవాటిపై దృష్టిపెట్టడం చాలా కష్టం" అని మంగళవారం అమెజాన్ సిబ్బందికి రాసిన ఒక లేఖలో బెజోస్ చెప్పారు.
 
నేను సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా అమెజాన్ ముఖ్యమైన కార్యక్రమాల్లో ఉంటాను. అలాగే, డే వన్ ఫండ్, బెజోస్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆరిజన్, ది వాషింగ్టన్ పోస్ట్, నా ఇతర అభిరుచులపై కూడా దృష్టి పెట్టడానికి అవసరమైన సమయం, శక్తి కూడా నాకు లభిస్తాయి"
 
"అంటే, ఇది రిటైర్ అవుతున్నట్టు కాదు. ఈ సంస్థలకు ఉన్న ప్రభావాల పట్ల ఎక్కువ అభిరుచి ఉన్నట్లు నాకు అనిపిస్తోంది" అన్నారు. 57 ఏళ్ల జెఫ్ బెజోస్ 1994లో ఆన్‌లైన్ బుక్ షాప్ ప్రారంభించినప్పటి నుంచి అమెజాన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. 
 
ఈ సంస్థలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్యాకేజ్ డెలివరీ నుంచి వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ సేవలు, ప్రకటనల ద్వారా జెఫ్ బెజోస్ 196.2 బిలియన్ల సంపద ఆర్జించినట్టు ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితా చెబుతోంది.
 
పుతిన్ 'పాయిజనర్' అంటూ నావల్నీ ధ్వజం..
 
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను విమర్శిస్తున్న అలెక్సీ నావల్నీకి మాస్కో కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో రద్దు చేసిన శిక్షకు సంబంధించిన షరతులను ఉల్లంఘించారంటూ కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. 
 
అలెక్సీ నావల్నీపై గత ఆగస్టులో ప్రాణాంతక రసాయన ఆయుధ దాడి జరగటంతో జర్మనీలో చికిత్స అందించారు. మరణంతో పోరాడిన ఆయన కోలుకుని గత నెలలో రష్యా తిరిగి వచ్చారు. అప్పటి నుంచీ ఆయన పోలీసు నిర్బంధంలో ఉన్నారు.
 
నావల్నీకి మద్దతుగా మాస్కో సహా రష్యా అంతటా వేలాది మంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మాస్కోలో హింసాత్మక సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సోషల్ మీడియాలో పోస్టయిన ఒక వీడియో.. నావల్నీకి మద్దతుగా ప్రదర్శన చేస్తున్న వారిని పోలీసులు కొట్టటం, అరెస్టు చేస్తున్న దృశ్యాలను చూపుతోంది.
 
అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించారనే అభియోగాలపై నావల్నీకి విధించిన శిక్షను గతంలో సస్పెండ్ చేయగా.. దానిని ఇప్పుడు జైలు శిక్షగా మార్చారు. ఆయన ఇప్పటికే సంవత్సరం పాటు గృహ నిర్బంధంలో శిక్ష పూర్తి చేశారు. ఆ కాలాన్ని జైలు శిక్ష కాలం నుంచి మినహాయిస్తారు.
 
కోర్టు తీర్పు అనంతరం నావల్నీ మీడియాతో స్పందిస్తూ నిర్లిప్తంగా భుజాలు కదిలించారని మాస్కోలోని బీబీసీ ప్రతినిధి సారా రెయిన్స్‌ఫోర్డ్ చెప్పారు. ఆయన కోర్టులో మాట్లాడుతూ దేశాధ్యక్షుడు పుతిన్‌ను ‘పాయిజనర్’ అని నిందించారు. తనపై దాడిన విషప్రయోగానికి ఆయనే కారణమని ఆరోపించారు.
 
నావల్నీ మద్దతుదారులు తక్షణ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. పోలీసులు భారీగా మోహరించినా.. సెంట్రల్ మాస్కోలో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వందలాది మంది గుమిగూడారు. ఒక్క మాస్కోలోనే 850 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారని పరిశీలకులు చెప్తున్నారు.
 
కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తాము అప్పీలు చేస్తామని నావల్నీ తరఫు న్యాయవాది తెలిపారు. నావల్నీకి శిక్ష విధించటం పట్ల అంతర్జాతీయంగా తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి. కోర్టు తీర్పు విశ్వసనీయతను ఓడించిందని ఐరోపా ఖండంలో ప్రధాన మానవ హక్కుల సంస్థ కౌన్సిల్ ఆఫ్ యూరప్ తప్పుపట్టింది.
 
ఈ తీర్పు వికారమైనదని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ అభివర్ణించారు. పౌర స్వాతంత్ర్యాలు, చట్టపాలనకు ఈ తీర్పు గొడ్డలి పెట్టని జర్మనీ విదేశాంగ మంత్రి హీకో మాస్ మండి పడ్డారు. నావల్నీని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ డిమాండ్ చేశారు. రష్యా తన పౌరుల హక్కులను కాపాడటంలో విఫలమైందంటూ.. ఈ విషయంలో ఆ దేశాన్ని బాధ్యురాలిని చేయటానికి మిత్రదేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు.